పుట:కాశీమజిలీకథలు -09.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కటాక్షమే కారణమని చెప్పుటయు నా మహేంద్రుఁడు ప్రసన్నవదనుండై వీరుఁడా ! నీవిక భూలోకమున కరుగవలసిన పనిలేదు. ఇందే యుండుము. అని పలుకుచు నీ మణివలయము స్వయముగా నాకరంబునఁ దొడిగెను.

అప్పుడు నేను పరమానంద భరితుండనై స్వామీ ! నేనందు వచ్చుచు నా భార్యను భూలోకములో విక్రమార్క మహారాజునొద్ద నునిచి వచ్చితిని. ఆ యువతిని వెంటఁబెట్టికొని యతివేగముగా రాఁగలను. సెలవీయుఁడని పలుకుచుఁ దదానతిఁ గైకొని వచ్చితిని. దేవరనిమిత్తమై మధుపఝంకారము భరితంబగు నీ కల్పతరుప్రసూన మాలికం దెచ్చితి. దరింపుఁడని పలుకుచు నాదామంబు విక్రమార్కుని మెడలో వైచి నా భార్య యెందున్నదని యడిగెను.

విక్రమార్కుం డేమియు మాటాడలేకపోయెను. సభ్యులందఱు తెల్ల పోయి యొకరిమొగ మొకరు చూచికొనఁ దొడంగిరి.

వీరుఁ – ఓ మహారాజా ! మాటాడలేవేమి ? నా ప్రియరాలెందున్నది ? చూడవలయునని నాకు మిగుల వేడుకగా నున్నది. వేగ రప్పింపవా ?

విక్రమార్కుండు — ఏమియు మాటాడక కన్నుల నీరునించుచు దెల తెల్లపోయి చూచుచుండెను.

వీరుఁడు - ఏమి స్వామీ ! మాటాడవు ?

సభ్యుఁడు - నీభార్య యగ్నిలోఁబడి మృతినొందినది.

వీరుఁడు – అయ్యో : ఇది యేమి పాపము అగ్నిఁబడనేల ?

సభ్యుఁడు- ఖండితములై పడిన భవదీయ కరచరణ శిరఃకబంధాదులఁ జూచి నీవు శత్రువులచేఁజంపఁ బడితివని నీ శరీరముతోఁ గూడ నీభార్య యగ్నిం బడినది. వలదని యెంత చెప్పినను వినినదికాదు.

వీరుఁడు - అక్కటా? అవియన్నియు రాక్షస మాయలుగదా ?

సభ్యు – ఏ మాయలో మాకేమి తెలియును ?

వీరు - మహారాజా ! నీవు పరనారీ సహోదరుండవనియు నర్దిజన కల్ప వృక్షుండవనియు నెల్లరుఁ జెప్పికొనెడు గొప్పదగు నీకీర్తి విని ప్రాణసమానయగు నా భార్యను నీకడనునిచి పోయితిని. ఇట్టి నీవు నాభార్య నంతఃపురమున దాచి యగ్నిఁ బడినదని బొంకుట ధర్మమా ? వేగఁ దీసికొని వచ్చి నాభార్య నర్పింపుము.

రాజు - (చెవులు మూసికొని) రామరామ. నే నట్టి పనిఁ గావింతునా ? దైవముతోడు. నీ భార్య యగ్నింబడినది. ఎల్లరుఁ జూచుచునే యుండిరి.

వీరు -- మహారాజా ! ఏల బొంకెదవు ? నా భార్య నీ యంత:పురమున నున్నదని రూఢిగాఁ జెప్పఁగలను. వేగ రప్పింపుము.

రాజు - (అంతఃపుర చారిణుల రప్పించి) ఈతని భార్య మన యంతఃపురమున నున్నదని చెప్పుచున్నాఁడు. ఉన్నదా ?