పుట:కాశీమజిలీకథలు -09.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దేవతలకు సహాయము జేయవలసి యున్నది. ఈ నా భార్య నెందుంచుటకుం దోచక నీవు పరనారీ సహోదరుఁవని విని నీకడ నుంచుటకై తీసికొని వచ్చితిని నాకీ యువతి ప్రాణములకన్న నెక్కువ ప్రీతిదాయిని యైనది. దీని నీవు భద్రముగాఁ గాపాడెద నంటివేని నీకడ నుంచెద నే మనియెద వని యడిగిన నా భూపాలుం డిట్లనియె.

మహావీరా ! దేవకార్య మందఱకు విధాయక కృత్యమే. నీ భార్యను బుత్రికఁగా జూచి రక్షించెద నేకొదవయు రానీయను. నీవు శ్రీఘ్రముగాఁ బోయి వేల్పులకు విజయము కలుగునట్లు చేయుమని పలికిన సంతసించుచు నా వీరుండు తన భార్యను విక్రమార్కుని చేతఁ బెట్టి యెల్లరు చూచుచుండ నాకలమునకు నిర్గమించి యంతర్దానము నొందెను.

అతం డఱిగిన ముహూర్తకాలములో నాకాశమున అరే నిలు నిలు పోకుము పోకుము కొట్టుము పొడువుము జంపుము అని యోధభటుల కోలాహలధ్వనులు వినంబడినవి. ఆ ఘోషకులు విని సభ్యులందరు నీ వలకు వచ్చి తలలెత్తి నింగిదెసఁ జూచుచుండిరి. ఆకాశమున మహాయుద్ధము జరుగుచున్నట్లు చప్పుడు వినంబడినది.

అంతలో నా విక్రమార్కుని ముందర నెత్తురు గారుచు దృఢ ముష్టీ నిష్ఠీడిత కృపాణమగు హస్త మొకఁటి జారిపడనది. నరేంద్రుండు దానిం జూచి యోహో? ఈ చేయియు నీ కత్తియు మన వీరునిదే యని తోచుచున్నది. ఇతని హస్తము శత్రువులు ఖండించిరిఁ కాఁబోలు. అయ్యో! పాపము అని పలుకుచుండఁగనే రెండవచేయియు గాళ్ళను మొండెము తలము ఖండితములైన వేఱు వేఱ నానృపాలుని మ్రోలం బడినవి.

వానిం జూచి యాచిన్నది గోలు గోలున నేడ్చుచు నురము బాదుకొనుచు మహారాజా! నా భర్త శత్రువులచేఁ జంపబడియెను. దేహ మతనిదే. ఇక నాకు గతి యేమున్నది? మృతినొంది నాపతిం గలసికొనియద. వేగము చితి నేర్పరిపించుము. గడియ బ్రతుకజాలనని దుఃఖించుచుండ వారించుచు నొడియండు పడతీ? నీవు విచారింపకుము. నిన్నుఁ బుత్రికవలెఁ జూచి కాపాడెద నగ్నిం బడినేల నని పలికిన నక్కలికి యిట్లనియె మహారాజా? సర్వజ్ఞుండవు. నీకు నేను జెప్పవలయునా ? భర్తృవిహీనమైన యీ శరీర మెందులకై పోషింతును. వినుండు -

శ్లో. శశినాసహయాతి గౌముదీ
    సహమేఘన తడిత్ప్రలీయతే
    ప్రమదాఃతతి భర్తృగా ఇతి
    ప్రతిపన్నంహి విచేతనైరపి.

మఱియు

    మృతే భర్తరియానారీ సమారోహిద్దుతాసనం
    సారుంధతీ సమాభూత్వా స్వర్గ లోకే మహియతే.