పుట:కాశీమజిలీకథలు -09.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మిచ్చుచుండునఁట. వీనినిప్పుడు మీకర్పించుచుంటిని దీనవచ్చిన బంగారము మీయగ్రహారస్థు లందఱుఁ బంచికొని భుజింపుడు. కొంతపట్టు మీ కష్టములు దీరవచ్చును. మీకిచ్చుట కింతకన్న నిప్పుడు నాయొద్ద నేమియును లేదు. అనుగ్రహించి నన్నుఁ గృతార్థుం గావింపుడు.

అని వేడుకొనుటయు నోహో ! ఇంతకన్న నధికమేమి కావలయును. మమ్ముఁగూడఁ జక్రవర్తులఁ గావించితివని వారు స్తోత్రములు సేయుచుండ నాకుండలములు బ్రాహ్మణార్పితము గావించి యటఁ గదలి తన గుఱ్ఱమున్న చోటికింబోయి యెక్కఁబోవు సమయంబున నే నెదుర నిలువంబడితిని. నన్నుఁజూచి చిఱునగవుతో రాజు ఓహో! నీవు మదనమంజరివి కావా ? ఇచ్చటి కెట్లువచ్చితివి.

నేను - దేవరవారు మున్ను నాకిచ్చిన వరము మరచిపోయి దేశాటనము జేయుచున్నారు. ఆ మాట జ్ఞాపకము జేయుటకై వచ్చితిని.

రాజు - ఏమి వర మిచ్చితిని?

నేను - మాయక్క కూఁతురు త్రిపురసుందరిని రెండవభార్యగా స్వీకరింతు మని యభయహస్త మీయలేదా?

రాజు — ఇందులకై యింతప్రార్దనయేల? అట్లే స్వీకరింతునుగా.

నేను - మిమ్ముఁ జూడ దేవలోకవాసు లందఱు నుత్సుహము జెందు చున్నారు! ఈ దారి నలకాపురమునకు దయజేయుఁడు.

రాజు - (నవ్వుచు) దేవలోకములలో నాటకము లాడి నన్ను బెద్దగాఁ బొగడుచుంటివఁట. ఆ వార్తలు నాకుఁ దెలియుచున్నవి. సిగ్గగుచున్నది.

నేను - నేఁ జెప్పనేల? నాఁడు మీరు కాపాలికునిఁ బరిభవించిన విషయము కుబేరుఁడెఱుఁగడా? మహేంద్రుఁ డెఱుఁగడా? బృహస్పతి యెఱుఁగడా? పరమేష్టి యెఱుఁగడా? వారందఱు తమ వలనఁ గాదని చెప్పలేదా? బ్రహ్మ మీకడకుఁ బొమ్మని యెఱింగింప లేదా?

రాజు — సరిసరి అదియొక ఘనకార్యమనియే తలంచుచుంటిరా?

అది యొకటననేలా? ఇటీవల మీరు గావించిన సాహస వితరణాది గుణ గణంబులు వేల్పులకుఁ దెలియలే దనుకొనిచుంటిరా? బలివాకిలిఁ గాచికొనియున్న శ్రీమన్నారాయణుండు మీ చేతులు బట్టి తీసుకొనిపోయి బలిపీఠముకడఁ జేర్చిన వార్తలు దేవలోకములన్నియు వ్యాపించినవి. రసరసాయనములు వృద్ధ భూసురున కిచ్చిన మాట విని కల్పవృక్ష మాకు రాల్చుచున్నది. మహారాజా ! నే జెప్పనేల ?

రాజు — అది నీ కృతజ్ఞతా లక్షణము పోనిమ్ము. మఱియు నేను మిత్రులతోఁ జెప్పకుండ నీ స్తంభంబువార్త విని వచ్చితిని. వారు నా జాడఁ దెలియక పరితపించుచుందురు. నేనింటికిం బోయి వారింగలసికొని పిమ్మట మీ లోకమునకు వచ్చెద.