పుట:కాశీమజిలీకథలు -09.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఆమాటలే చెప్పుకొనుచున్నారము. అతఁ డేదేశస్థుఁడో తెలియదు. వినోదముగా గుఱ్ఱముపైఁ గూర్చుండుట యనుకొనెను కాఁబోలు ? భార్యాపుత్రులతోఁ బోట్లాడి బలవంతమునఁ జావ నరుదెంచెనా అని యక్కడివారు నా కా తెఱంగెఱింగించిరి.

అప్పుడు నా హృదయంబునఁ జింతావిస్మయసంభ్రమంబు లావిర్భవింప నేమిఁ జేయుటకుఁ దోచక తొట్రుపడుచు నిట్లు తలంచితిని. అక్కటా? అనేక కోటి యోజనముల దూరములో నున్నను సూర్యతాపము సంతాపము గలుగఁ జేయుచుండును. దాపునకుఁ జేరిన లోహములనైన భస్మముఁ జేయఁగలదె. ఈ స్థంభంబు మిట్ట మధ్యాహ్నము సూర్యునంటియే వచ్చునట. ఈతం డెట్లు జీవింపగలఁడు? అయ్యో? ఇట్టి పరోపకారపారీణున కి దుర్మరణము గలుగవలసి వచ్చినది. ఈ పుణ్యపురుషు నలకాపురమునకుఁ దీసికొనిపోయి యెంతయో యుత్సవము సేయవలయునని తలంచి యుంటి నేదియు లేకపోవును గాఁబోలు. అట్టి పని జరుగదు. ఈ మహాత్ముని దేవతలు రక్షింపరా ?

సూర్యుఁ డీతని సద్గుణంబులు వినియుండఁడా? అదివఱ కితఁడు కావించిన సాహస క్రియలకన్న నది పెద్దదియో? వీని కీమియు భయములేదు. సాయంకాలమున నీ సుకృతదర్శన మగునని తలంచుచు నా దేవళముముందర నిలువంబడి చూచు చుంటిని.

ఈతని నీవెఱుంగుదువాయేమి? పరితపించు చుంటివని యందలివారలు నన్నడుగ నేనిట్లంటి. ఈతని నేనె కాదు. పేరుసెప్పిన మీరుగూడ నెఱింగియుందురు. ఇట్టిసాహస మెవ్వఁడు చేయగలఁడో తెలిసికొనలేరా?

సీ. బలిమిభేతాళునిఁ బట్టి తెచ్చిన మేటి
                 తను వఱ నుట్టిగోసిన ఘనుండు
    తప్తతైలోరుపాత్రమున దూఁకిన వీరుఁ
                డడిగిన తను విచ్చినట్టి దాత
    గళరక్త మర్పించి గర్తంబు పరిసం
               పూర్ణంబు జేసిన పుణ్యమూర్తి
    తలఁగోసి బలియిచ్చి ద్వాదశవార్షికా
               వగ్రహంబుడిపిన ప్రథితయశుఁడు
గీ. రస రసాయనములను నిర్లక్ష్యముగ ధ
   రామరున కిచ్చినట్టి మహావదాన్యుఁ
   డితఁడు శ్రీవిక్రమార్క నరేంద్ర చక్ర
   వర్తి యిట్టి సాహసగుణ మెవ్వరికిఁ గలుగు?

అతండు విక్రమార్కుండని చెప్పినంత విని యందలి వారెల్ల హాహాకారములు గావింపుచు నోహో యెవ్వఁడో యని యుపేక్షించితిమి. అతండని యెఱింగిన