పుట:కాశీమజిలీకథలు -09.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(37)

విక్రమునిదేశయాత్ర కథ

289

సంతసించుచు నతండు వయస్యా ! నీవు నాయం దిష్టము గలవాఁడవైతేని యిది మొదలు మనుష్యుల భక్షించుట మానవలయును.

శ్లో. యధాచ తే జీవిత మాత్మనః ప్రియం
    తథా పతేవామపి మాత్మనః ప్రియం
    సంరక్ష్యతే జీవిత మాత్మనో యథా
    తథా పరేక్షామపి రక్ష జీవితం

నీదేహము నీకెంత ప్రియమో యితరుల దేహము వారికంత ప్రియముగా నుండదా ? ఒరుల దేహములు భక్షించి నీవు నీదేహమును గాపాడుకొనుచుంటివి. ఇది యెంత యుచితమైన పనియో యాలోచింపరాదా? ఆ కలములు దివినఁ బొట్టనిండదా? ఈ నా ఘాతుకృత్యము మాను మదియే నా యభీష్టమని పలికిన సంతసించుచు నారాక్షసుఁ డట్టి వరమిచ్చి యవ్వలకుఁ బోయెను. విక్రమార్కుండు నట్లు బ్రాహ్మణరక్షణము గావించి యటఁ గదలి మఱియొక దేశము వోయెను.

అమ్మహారా జీవాటిసాహసకృత్యము లనేకములు గావింపుచుఁ దిరిగి దిరిగి పాతాళలోకమున కరిగి బలిచక్రవర్తిచే సన్మానితుండై రస రసాయనములఁ గానుకగాఁ బడసి వాని బ్రాహ్మణార్పితము గావించి భార్యావియోగచింతాసంసక్తచిత్తులైన కేసట దర్పకులను విప్రకుమారులభార్యల వెదకి తెచ్చి వారితోఁ గూర్చి తరువాత మఱికొన్ని దినంబులకు సూర్యగిరిం జేరెను. నే నానృపాలుని వెనుకనే పోవుచుంటిని. క్రమంబున నేనుగూడ సూర్యగిరి కిరిగితిని. జాము ప్రొద్దునప్పటికి నే నాతటాకముదాపునకుఁ బోయితిని.

జనులు గుంపులుగాఁ గూడికొని వింతగాఁ జెప్పుకొనుచు దుఃఖము లభినయింపు చుండిరి. నే నదియేమని యడుగఁగా గొంద రిట్లనిరి. పాప మొక చక్కని పురుషుం డెవ్వఁడో రాత్రి కీదేవాలయమునకుఁ జేరెను. కాంచనస్థంభవృత్తాంత మడుగ నెందులకో యనుకొంటిమి. నేఁటి యుదయమున లేచి యీ తటాకములో స్నానముఁ జేసి యర్కప్రతిష్టితంబగు నీశివలింగంబుఁ బూజించి యరుణము జపించుచు సూర్యోదయమువఱకు నీసోపానములఁ గూర్చుండెను.

అంతలోఁ గాంచనస్థంభంబు వాడుకప్రకారము జలమునుండి బయలుదేరినది. రెండు మూఁడు బార లెత్తెదిగినతోడనే వలదు వలదు భస్మమగుదువని యర్చకు లరచుచుండ వినిపించుకొనక గుభాలునఁబోయి యాస్థంభాగ్రమున నున్నపీఠంబునం గూర్చుండెను. అందరము చూచుచునే యుంటిమి. ఏమి చేయఁగలము, అతివేగముగ నాస్తంభ మెదిగిపోవుచుండ వారింప నెవ్వరిశక్యము ?

అదిగో స్థంభము చాలదూరము పోయినది. చివర గనంబడుటలేదు. మధ్యాహ్నమునకు రవి నందునని చెప్పుదురు. పర్వతములనైన భస్మము జేయు సూర్యుని సమీపమున మనుష్యమాత్రుఁడు నిలుచునా ! ఈపాటికే భస్మమైయుండును.