పుట:కాశీమజిలీకథలు -09.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఈ తటాకము సంతతము మధురజలపూరితమై యుండునట్లు చేయుటయే నా యభీష్టమని యతండు పార్ధించుటయు లక్ష్మీధవుండు నరేంద్రా? నీవు తీరంబుఁ జేరుము. కాసారంబు అవ్వారిగ వారి పూరితంబుగాఁ గలదని యానతిచ్చెను. విక్రమార్కుండు గట్టెక్కిన సుముహూర్తమునందే యాగర్తమంతయు నమృత పూరితంబై యాహ్లాదము గలుగఁ జేసినది. అందలి వారెల్ల నతఁడు విక్రమార్కుండని యెఱుంగ కున్నను తత్సాహసగుణంబు పెద్దగా నగ్గించిరఁట. అమ్మహారాజు వారికట్టి యుపకారముగావించి యవ్వలఁ బోయెనఁట. వింటిరా? అతం డెటువంటి సాహసుడో ? ఇది యొక్కటి యేనా ? ఈలాటిచెయ్వు లనేకములు గావించెను. తనప్రాణముఁ దృణముగానైనఁ జూచుకొనఁడు.

ఒకచోఁ దప్తతైలంబునం బడి మన్మథసంజీవిని దేవతం బ్రత్యక్షముఁ జేసికొని భూసురకుమారున కర్పించెనఁట. మఱియొకచోట వేణు వివరములో బ్రహ్మరాక్షసావేశితయగు యువతిని విడిపించి రక్షించెనట.

మఱియు శైవాలక శైలప్రాంతమందలి పరాశ నగరమను నగ్రహార వాసులగు భూసురులు ఏకచక్ర పురవాసులు బకాసురునకు వలె నప్పర్వతాగ్ర వాసియగు రాక్షసునకు నిత్య మొక్కొక్కఁడు వోయి యాహారమగునట్లు నియమముఁ జేసిరఁట. విక్రమార్కుండొక నాఁ డాయగ్రహారమున బఁసజేసి తానున్న బ్రాహ్మణకుమారునకుం మఱునాఁడు వంతు వచ్చినదని గ్రామాధికారులు వార్తఁ బంపుటయు వారు దుఃఖింపుచుండ నోదార్చుచుఁ దానా దానవున కాహారముగాఁ బోయి వధ్యశిలపైఁ గూర్చుండెనఁట.అంతలో నారాక్షసుఁ డరుదెంచి దరహసితవదనారవిందుండై యందుఁగూర్చున్న విక్రమార్కుం గాంచి మహాసత్వుఁడా ? నీ వెవ్వఁడవు ? ఆసన్న మరణుండవయ్యు నించుకయు విచారము లేక సంతోషముతో వసించితివి. కాఁబోవుపని యేమియో యెఱుఁగుదురా ? అని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.

దానవేంద్రా ? నీకీ ప్రశ్నాయాసముతోఁ బనియేమి ? నేను బరార్ధమై శరీరమును విడుచున్నాను సంతోషము గాక విచారమేలఁ గలుగును. అగ్ని సాత్కృతముగా నున్న యీ దేహమును భక్షించి నీ యాఁకలి యడంచుకొనుము. నాకుఁ బుణ్యము రాఁగలదు. అని యుత్తరమిచ్చుటయు నోహో ? ఇదివఱ కెవ్వడు నింత ధైర్యముగాఁ బలికినవాఁడు లేఁడు. వ్యధశిలఁ జేరినతోడనే యెట్టివాఁడును. మున్నే చచ్చిన పరదుఃఖమును సహింపక నిర్లక్ష్యముగా శరీరమును విడుచుచున్నాఁడు. ఇట్టి సాధుపురుషుని భక్షించిన నాకు జీర్ణముకాదు. వీని ముట్టగూడదని తలంచుచు నతని కిట్లనియె.

ఓ మహాపురుషా! నీవు పరార్దమై శరీర మర్పించుచుంటివి. కావున శ్లాఘనీయుఁడ వైతివి. నీగుణమునకే మెచ్చినవాఁడ. వరంబు వేడు మిచ్చెదనని యడిగిన