పుట:కాశీమజిలీకథలు -09.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమునిదేశయాత్ర కథ

287

మాణి — తచ్చరిత్రములు విన నాకును మేను గగుర్పొడుచుచుండును. వింతయైన చర్య యేదేని గలిగిన వక్కాణింపుము.

అనుటయు మదనమంజరి యిట్లు చెప్పఁదొడంగెను.

విక్రమార్కుండు తన పేరెవ్వరికిఁ జెప్పకుండ దేశాటనముఁ జేయుచుండెను. ఒకనాఁ డొకగ్రామప్రాంత దేశమునుండి యరుగుచు జనశూన్యమైన గొప్ప తటాకగర్తమును గాంచెను. మిక్కిలి లోతగు నాగోతిలో నాలిచిప్పెడు నుదకమైన లేదు. ఎటు జూచినను రెండుక్రోశముల వైశాల్య మున్నది. ఆ నిర్జలతటాకముఁ జూచి యతండు మిక్కిలి వెఱగుపడుచు నీకాసార మింతలోతు గలిగియు నుదకము లేక పోవుట వింతగా నున్నది. ఇందుల కేదేని కారణ ముండకపోవదు. విచారించెదంగాక యని తలంచి యాగోతి కడ్డపడి నడుచుచుఁ దన్మధ్యభాగంబున నొప్పుచున్న విష్ణ్వాలయముఁ జేరి యద్దేవునకు నమస్కరింపుచు నందలి విశేషములఁ బరికింపుచుండ నొక శిలాశాసన మతనికి గనంబడినది. దానిం జదువ నిట్లున్నది.

ఈచెఱు వొకమహాభాగ్యవంతుఁడగు వర్తకునిచేఁ ద్రవ్వింపఁబడినది. దీనిం ద్రవ్వుచుండ భూమిలో నీవిష్ణ్వాలయము బయల్పడినది. అతఁ డీదేవాలయమునుజక్క పరచెను. తటాకములో నెంతవర్షము గురిసినను చిప్పెడు నీరైనను జేరదు. చేరినను నిలువదు. ముప్పదిరెండు గుణములు గల మహారాజు శిరోరుధిరంబున నీభూమిందడిపె నేని తటాకము జలపూరితమై యొప్పఁగలదు. అని యాకాశవాణివలనం దెలియఁబడినది. అట్టి గుణములుగల పుణ్యాత్ము లట్టిసాహసము గావించిరేని పెక్కండ్ర కుపకారమగును. ఈ మరుభూమి నీరులేక ప్రజలు చాల యిబ్బంది పడుచున్నారు

శ్లో. శతమపి శరదాం వైజీవితం ధారయిత్వా
    శయన మధిశయానః సర్వధా నాశమేతి
    సులభవిపది దేహే సూరిలోకైకనింద్యే
    నవిదధతి మమత్వం ముక్తికాంతోత్సుకాస్త్సే.

నూఱేండ్లు బ్రతికినను శరీర మెప్పటికైన నాశనముఁ జెందకుండదుగదా ? బుద్బుదమువలె క్షణభంగురమైన శరీరమున ముక్తికాంతాసక్తులగు విద్వాంసులు మమత్వమును వహింపరుగదా?

అని యున్న శాసనము ముమ్మారు చదివి యాభూపాలుం డపారసంతోషముతో నత్తటాకగర్భప్రసాదంబున నొప్పు పుండరీకాక్షుం బూజించి యోమహానుభావ! ద్వాత్రింశల్లక్షణయుక్తుండగు పురుషుని కంఠరక్తం బభిలషించితివఁట. ఇదిగో నా శిరంబు నఱుకు కొనుచున్నాను. మదీయకంఠ రుధిరంబునఁ దృప్తుండవై తటాకంబును నింపుము అని పలుకుచుఁ గత్తి నెత్తి కంఠమును కోసికొనఁబోవునంతలో లక్ష్మీనాథుండు ఏ! నిలు, నిలు. నీసాహసమునకు మెచ్చికొంటిని. వరంబులం గోరుకొను మని గత్తి పట్టుకొని యడిగిన నమస్కరించుచు మహాత్మా! నాకేకోరికయును లేదు.