పుట:కాశీమజిలీకథలు -09.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దర్పకుని కథ

283

కెగసిపోవుచుండిరి. ఆకాశమునుండి వారు భూలోకమునుఁ బరీక్షింపుచుఁ బోవుచుండ నొక నగరములో నొక ధనికునియింట వివాహప్రయత్నము జరుగుచుండుటం దిలకించి నన్నందుంచి యా యోగిను లవ్వలఁ బోయిరి.

అయ్యజమానుని యింట నా రాత్రి వివాహము జరుప నిశ్చయించిరి. పెండ్లికూఁతురు మిక్కిలి చక్కనిది. దానిపేరు సుమన. ఏ కారణముచేతనో యిదివఱకు నిశ్చయించిన పెండ్లికుమారుఁడు సుముహూర్తమునకు రాకపోయెను. ఆ పెండ్లికుమారుఁడు చక్కనివాఁడు కాదని వారిలోఁ గొందఱ కిష్టములేదట. అభినవరూప యౌవన శోభితుండగు నన్నందుఁ జూచి యా యజమానుడు మొదటివాడు సమయమునకు రాకపోయిన కారణంబునంబట్టి వాని యందీసు జనింప నాప్తులతో నాలోచించి వీనిని మనయింటికి భగవంతుఁడే తీసికొనివచ్చెనని సంతసించుచు నాకుఁ జెప్పి మంగళస్నానములు జేయించి యాసుమనను నాకు వివాహము గావించిరి.

హటాత్సంసిద్దమైన శోభనమునకు ముఱియుచు నేను వారింటనుండఁగా నొకనాఁటి రాత్రి మరల నా యోగినీచక్రము చక్రపురమునుండి వచ్చును నాయున్న యునికి తెలిసికొని నన్నె త్తికొని యాకాశమార్గంబున బోవుచుండిరి. అప్పుడు మఱియొక యోగినీగణము వారికెదురు పడియెను. వారికిని వీరికిని మాటలు గలియక జగడము వచ్చినది. అందు యోగినీగణములు రెండును ముష్టియుద్దము ప్రారంభించినవి. ఆ గడబిడలో నేను వారిచేయిజారి యిందుఁ బడితిని. నీటిలో బడుటచే బ్రతికితినికాని లేనిచోఁ జచ్చువాడనే మీరు నన్నీ యాపదనుండి తప్పించిరి. అకారణబంధులైన మీ యుదంతముగూడ వినిపింపుడు సంతసించెదనని చెప్పిన విని నవ్వుచు విక్రమార్కుం డిట్లనియె.

మీ యిరువుర చరిత్రము నొక్క పోలిగనే యున్నది. మీ యిద్దరు చక్కని ముద్దుగుమ్మలం బెండ్లియాడిరి కాని వారి కులశీలనామంబు లెట్టివో యెఱుగ రైతిరి. అని పలుకుచు గేసటుని వృత్తాంత మంతయు నతనికి జెప్పించెను. ఇరువురు నొండొరులం బోలియుంటిమని మైత్రిగలుపుకొని యాపదపాలు గాకుండ నిరువురఁ గాపాడినవాఁ డాతండే యని యెఱిఁగి విక్రమార్కుని స్తుతింపుచుఁ బుణ్యపురుషా! మాకు మా భార్య లెందుండిరో తెలియదు. ఇప్పుడు మేమేమి చేయవలయును? కర్తవ్య ముపదేశించుఁడని వేడుకొనిరి.

నేనొక పనిమీఁద బోవుచున్నాను కానిండు. మిమ్ము భార్యలతోఁ గలిపియే పోయెదం గాక నడువుఁడని యా యాగ్రామముల గురుతులు మఱియు మఱియు విని యొకమార్గంబునబడి పోవుచు వారితోఁ గూడ గొన్ని పయనములు సాగించెను. ఒకనాఁడు సాయంకాలమున కొక యగ్రహారమునకుఁబోయి యొక గృహస్థుని యఱుగమీద బండుకొనిరి.

అప్పుడా యగ్రహారమున గొప్ప వివాహము జరుగుచుండును. ఆ పెండ్లికి