పుట:కాశీమజిలీకథలు -09.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నానాదేశములనుండి బ్రాహ్మణులు పెక్కండ్రు వచ్చియుండిరి. అనేక మహోత్సవములు సేయుచుండిరి. నాఁడు రెండవదివసము రాత్రి యేదియో నాటక మాడించఁ దలంచుకొని భోజనములు పెందలకడ గావింప గ్రామస్థులఁ బిలుచుటకు బంధువులు కరదీపికలతో బయలుదేరి తిరుగుచు నా పరదేశుల మువ్వుర నొకయరుగుమీదఁ జూచి లెండు లెండు వంటలైనవి. నేఁడు పెందలకడ భోజనములు కావలసి యున్నవని లేపుటయు వారు మేము పరదేశులము. మాదీయూరు కాదని యుత్తరముజెప్పిరి.

అయ్యో! మీరు పరదేశులైన నేమి? ఇందా భేదము లేదు. మీరు తప్పక భోజనమునకు రావలయును. మా యజమానుఁడు బంధువులకన్నఁ బరదేశులనే యెక్కువగా మర్యాదజేయును. తప్పక రావలయునని గట్టిగా నిర్భదించి యప్పుడే వారిం బెండ్లివారింటికిఁ దీసికొనిపోయి మడిపుట్టములిచ్చి యొకచోఁ గూర్చుండబెట్టిరి.

భుజించునప్పుడు కేసటుఁడు విస్తళ్ళలో వడ్డించిన పదార్థములఁ జూచి యచ్చెరువందుచు దాపుననున్న మఱియొక కూఱునతో నయ్యా ఈ యజమానుం డెంత భాగ్యవంతుఁడేమి? ఇన్ని పిండివంటకములఁ జేయించెనని యడిగిన నతండిట్లనియె.

ఈతండు మొదట దరిద్రులలో దరిద్రుఁడు. దైవికముగావచ్చి వారింటఁ గాంచనవర్షము గురిసినది. ఇప్పు డితనికిఁ జాలిన భాగ్యవంతుఁ డీ దేశములో లేడు. వినుం డీయన కుమార్తె యెత్తు బంగారము కన్యాదాన సమయంబున దూచి వరున కిచ్చుటయేకాక మితిలేని కట్న మర్పించెను. కూఁతురు పుట్టునప్పు డట్లు మ్రొక్కికొనిరఁట. దాని యాచించుటకై విక్రమార్క మహారాజు నొద్దకుఁ బోవుచుండ దారిలో నెవ్వఁడో సిద్ధుండు గనంబడి రసాయాన మిచ్చెనట. దానివలన లోహము లన్నియు బంగార మగుచున్నవి అని చెప్పుకొనుచున్నారు. వీరికి బంగారమునకుఁ గొదవ యేమి? అట్లు జరిగిన నేనింతకన్న నెక్కువగా బిండివంటకములఁ జేయింతునుగా.

అది యిట్లుండె. పీతాంబరము ధరించి నేతి నొడ్డించు నా పాఱుం జూచితివా ? ఆతఁడే కన్యాదాత. వాని కెన్ని యేండ్లుండునో చెప్పుకొనుడని యడిగిన గేసటుండు పూర్ణ యౌవనములో నున్న వాఁడు ముప్పది యేండ్ల లోపువాఁడని చెప్పెను. పక పక నవ్వుచు నాయనకుఁ దొంబదియేండ్లున్నవి. ఆ సిద్ధునివలననే వీనికి యౌవనముగూడ సంప్రాప్తించినది. మున్నుజూచిన వారీతని నిప్పుడు చూచిన మిక్కిలి వెఱఁగుపడక మానరు. అని వాని వృత్తాంత మంతయుఁ జెప్పెను.

విక్రమార్కుండు ఆ విప్రుని బరికించి చూచి రసరసాయన ప్రభావముల నగ్గించుచు నా వస్తువులు సత్పాత్రహస్తంబునం బడినందులకు మిక్కిలి సంతసించెను. భోజనానంతరము వారు మువ్వురును వెనుకటి యరుగుదగ్గరకుఁబోయి పండుకొనిరి. ఆ సమయంబున మఱికొందఱు విప్రు లవ్వలి యరుగుమీదఁ బండుకొని యిట్లు సంభాషించుకొనిరి.