పుట:కాశీమజిలీకథలు -09.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(36)

కేసటుని కథ

281

మూఁడవనాఁడు పెండ్లికూఁతుం దీసికొని యా వృద్ధ బ్రాహ్మణుఁడు బంధువులతోఁ దమయింటికి బయలుదేరి నూరుబండ్లు గట్టించెను. క్రమంబున నర్మదానదీ తీరమున కరుదెంచితిమి. అందు ముందెక్కివచ్చిన యోడలో వారినెల్ల గూర్పుండఁ జేసి యా వృద్ధుడు వేఱొక చిన్న పడవలో నన్నును మఱికొందఱినిం గూర్చుండబెట్టి పయనము సాగింపఁజేసెను. రెండుయోడలు నీటి వేగమునను గాలి విసురునను నతిరయంబునం బోవుచుండెను. నే నున్న యోడలోని వాఱొక్కక్కరే యేదియో మిషఁబన్ని యాపినప్పుడెల్ల నా పెద్దయోడలో నెక్కుచుండిరి. నేనా కపటము గ్రహింపలేకపోయితిని. ఆ వృద్ధ విప్రుండు నావికులకు లంచమిచ్చి నేనున్న నావ ముంచునట్లు నియమించెను. నావికులు పెద్దయోడను దూరముగాఁ బోవనిచ్చి యొకచో నానావను బుడుంగున ముంచి తా మీదుకొనిపోయి యొడ్డెక్కిరి.

నే నీఁత యెఱుంగనివాఁడ నగుట దైవికముగా నాయోడకొయ్య యొకటి నాచేతికి దొరకుటయు దానింబట్టికొని నీటిలోఁ మునుంగక యింతదూరము గొట్టుకొని వచ్చితిని పుణ్యాత్మా? నీవు నన్ను బ్రతికించితివి. ఇది నాకు రెండవ గండము. కృతఘ్నుండయిన యాపాఱుండెట్లు కావించెనో చూచితిరా? అని తనకథ యంతయుం జెప్పుటయు నాలించి విక్రమార్కుండు వాని సుగుణవిశేషముల మెచ్చుకొనుచుఁ బెద్దగా నగ్గించుచు నిట్లనియె.

కేసటా! ఆ బ్రాహ్మణుఁడు నిన్నుఁ గోరినమార్గము ధర్మవిరుద్ధమై యున్నది. నీవు ధర్మపత్నిగా సమంత్రకముగా సాక్షకముగా స్వీకరించిన కన్యకారత్నమును మఱియొకనికి భార్యగాఁ జేయుటయెట్లు? ఈ పని రాజు వినిన శిక్షింప వచ్చును. అది యటుండె. నాసతీతిలకము నిన్నుఁగాక యాతనికుమారు నంగీకరించునా? రూపవతి నీ భార్యయేకాని యతని కోడలుకాదు. ఆ చిన్నది నిన్నుఁ గానక పరితపించుచుండును. నీవు వెంటనే యా గ్రామమరిగి పెద్దమనుష్యులకు జరిగినకథఁ జెప్పి యప్పడంతుకను వెంటఁ బెట్టుకొని రమ్ము. కావలసిన నేనుగూడ సహాయము వచ్చెదనని చెప్పిన సంతసించుచుఁ గేసటుం డయ్యా! నాకు వారిగ్రామమేదియో తెలియదు. ఇందుల సాధనము మీరే చెప్పవలయునని యతని నభినుతింపు చుండెను.

ఇంతలో నాకాశమున నేదియోకోలాహలము వినంబడినది. అది యేమియో యని వారిద్దరు నింగి దిసఁ బరికింపుచుండ నాకసమునుండి యొక పురుషుఁడు వారి ముందరనున్న నర్మదానదిలో గుభాలునఁబడి మునుంగుచుండెను. తటాలున దుమికి విక్రమార్కుండా పురుషునిఁ గూడ బైకి లాగికొనివచ్చి యాయసము వాయ నుపచారము గావించెను. ఆ పురుషుండు సేదతీరిన పిమ్మట వారడుగఁ దన వృత్తాంత నిట్టని చెప్పెను.