పుట:కాశీమజిలీకథలు -09.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గావించితిని. అందఱు తలుపు బిగించి యేగిన వెనుక రూపవతి సిగ్గువిడిచి దిగ్గున నాతల్పముజేరి ప్రాణేశ్వరా? మీరు విక్రమార్కుని మించిన సాహసులగుదురు. అక్కటా నాకు నిద్రబట్టక మేల్కొని మీవెంట వచ్చితిని కాని లేకున్న నాబ్రతుకేమికావలయును? నా కే యాధారము జూపిపోయితిరి? ఆయ్యయో? బ్రహ్మరాక్షసుని కట్టిమాట యిచ్చి వచ్చినచోఁ బెండ్లి యాడ నేమిటికి ? నాతో నొక్క గడియయైన సుఖింపరయితిరే. మంచి సత్యసంధులే యని యాక్షేపించుచు శృంగారలీలలకు నన్నుఁ బురికొల్పినది.

నేనప్పు డాత్మగతంబున నిట్లు తలంచితిని. ఆహా ! ఆ వృద్ధ బ్రాహ్మణుడు నన్నీ కన్యను బెండ్లి యాడి తన కుమారుని కర్పింపుమని కోరికొనెయెను. నే నట్లు అంగీకరించితిని. అట్లు జరిగించుట శాస్త్రదూష్యమే యగుంగాకా. నేననినట్లు చెల్లించు కొనక తప్పిన మహాపాతకము. కాని యిప్పు డీ చిన్న దాని నిర్బంధ మెక్కువగా నున్నది. ఏమి చేయుటకుం దోచకున్నది. నిజము చెప్పితినేని అసలే యొప్పుకొనదు. చెప్పకున్న నీ యన్ను మిన్న నన్నుఁ గలియక విడుచునట్లులేదు. మద్భుక్తమగు నీ మగువ యితరున కెట్లు పనికివచ్చును ?

ఆ వృద్ధ బ్రాహ్మణుఁడు కోరిన కోరికయు సమంజసముగా లేదు. ఒక పురుషుండు బెండ్లి యాడిన దానిని దనకుమారుని కెట్లు పనికి వచ్చునని తలఁచనో తెలియదు. రూపవతి మహాపతివ్రత. తన మెడ మంగళసూత్రము గట్టిన నన్నుఁగాక యితరు నంగీకరించునా? అయినను నీ ధర్మసందేహము పెద్దలవలన దెలిసికొని పిమ్మట సందర్భానుసారముగాఁ గావించెదంగాక. అంతదనుక యీ రహస్యము తెలియ నీయక యెద్దియోమిషఁ బన్ని దీనిం గలియకుండఁ గాలక్షేపము జేసెదనని తలంచితిని.

అప్పుడాతలోదరి తనచేతులతో నాచేతులు బట్టుకొని తన కపోలములపై నానికొనుచు మనోహరా! మీ రేదియో ధ్యానించుచుఁ బరాకుగా నుంటిరి. మరియెవ్వరి కయినా నేదియేని మాట యిచ్చి వచ్చితిరా యేమి? ముందుగనే చెప్పుడు. సవరణ గావించుకొనెదనని యడిగిన నేనిట్లంటి.

వాల్గంటీ ? నీవంటి సాధ్వీరత్నము నాకు భార్యగా లభింప నాకు ధ్యానింప నవసర మేమియున్నది. నీవు నన్నుఁ జావునుండి తప్పించితివిగదా ? ఇంక నట్టి యుపద్రవ మేమియునులేదు. నిన్నటి సమావేళన ముహూర్తము మిగిలిపోయినది. కలియుటకై నేఁడును రేపును మంచిలగ్నములు లేవు. మాయింటికిఁ బోయిన తరువాత దిరుగ సుముహూర్తము నిశ్చయించుకొనవలయు నిందుల కై ధ్యానించుచుంటినని పలికిన విని యక్కలికి అగునగు మంచియూహయే. యిప్పుడు మించినదేమియును లేదు. వీపంచిఁబాడెద నాలింపుఁడని పలుకుచుఁ దటాలున మంచముదిగి యందలి బీఠంబున గూర్చుండి పల్లకీగానంబున నా కానందము గలుగఁ జేసినది.

ఆనెపంబున నయ్యంబుజనేత్ర నారెండుదినంబులు నంటకుండ దాటించితిని