పుట:కాశీమజిలీకథలు -09.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేసటుని కథ

279

అర్దరాత్రము దాటిన పిమ్మట నేను మెల్లగాలేచి యా చిగురాకుబోఁడిం బరీక్షించి నిద్రబోవుచున్నదని నిశ్చయించి బ్రహ్మరాక్షసునిఁ యభిలాష తీర్చుటకై యల్లన మంచముదిగి చప్పుడుగాకుండఁ దలుపులు దీసి వీధింబడి రెండుగడియలలో నా బ్రహ్మరాక్షసుడున్న శ్మశానమునకుఁ బోయితిని రూపవతియుఁ గపటనిద్రఁబోవు చున్నది కావున నా పయనము పరికించి నే నెందుఁ బోవుచుంటినోయని యాలోచించి నాకుఁదెలియకుండ వెనుకవచ్చి యందొకచో నిలువంబడినది.

నే నా బ్రహ్మరాక్షసు నాహ్వానము గావించి మహాత్మా ! నీతోననిన ప్రకారము కార్యము దీర్చుకొని వచ్చితిని. నన్ను భక్షింపుమని పలికిన విని యతండోహో! నీవు మిగుల సత్యసంధుఁడవు. నీ కతంబున నీకులంబెగాక నీ నగరముగూడఁ బవిత్ర మయినది. అని మెచ్చుకొనుచు నన్ను భక్షింపఁ బ్రయత్నించుచున్నంతలో మా మాటలు వినుచున్న రూపవతి యత్యంత వేశముగావచ్చి మానడుమనిలిచి రాక్షసేంద్రా ఈతండు నా భర్త. వీని భక్షించిన నాగతియేమి? నే నెట్లు బ్రతుకుదాననని యడిగిన నా బ్రహ్మరాక్షసుఁడు నీకు భిక్షయే యిటుమీఁద గతియని యుత్తరము చెప్పెను.

అయ్యో ! నే నాఁడుదానను. నాకు భిక్ష యెవ్వరిడుదురు ? మహాసత్వా ! విచారించి చెప్పుమని యడిగిన నా రాక్షసుండు సాద్వీ ! నీ వెవ్వని భిక్ష నడుగుదువో యా వస్తువు వాఁ డీయకున్న వాని తల నూఱుముక్కలై వ్రయ్యగలదని వరంబిచ్చుటయు నా మచ్చెకంటి మిక్కిలి సంతసించుచు సత్యవచనా ? అట్లయిన నిన్నిప్పుడు పతిభిక్షఁ బెట్టుమని కోరితిని. నా యభీష్టము దీర్పుమని యడిగినది.

ఆ మాట విని యా రాక్షసుండోహో ! గడుసుదానవే. నా నోటఁజేరిన యాహార మిత్తు ననుకొంటివా ? మఱియొకరిని యాచింపుము. ఈతని విడువఁజాలనని పలుకుచుండఁగనే వానితల పెళ పెళ బ్రద్దలై నూరువ్రక్కలై పడినది. ఆ వింత నేను కన్నులార జూచి యా సాధ్వీరత్నము పన్నిన యుక్తికి విస్మయము జెందుచు నా యువతిని మిగుల నభినందించితిని.

ఆ చిన్నది నావలన జరిగిన కథయంతయు విని నా శీలమునకు మెచ్చుకొనుచు సిగ్గువిడిచి పెద్దగా స్తుతిఁజేయుచు నింటికిం దీసికొని పోయినది. అంతలోఁ దెల్లవారినది. అందు మారాక పోక లెఱింగినవారులేరు. ఒక గండము గడచినదని సంతసించి నంతలో రాత్రిపడినది.

ఆ రాత్రి మాశయనగృహాలంకారములు కడువింతగాఁ జేసిరి. రూపవతికి శృంగార అనురాగవతి యని యిరువురు చెలికత్తెయలు కలరు. వారును మిక్కిలి చక్కనివారే. మువ్వురు నొకటే ప్రాణమగుట రూపవతితో నీ వెవ్వని బెండ్లియాడెదవో మాకుగూడ భర్తయనియేర్పరచికొని యున్నారట. రెండవనాఁడు రాత్రి యాయిరువురు యువతులును గూడ నాగదిలో నాకుఁ బరిహాసోపచారము లనేకములుగావించిరి చాల ప్రొద్దుపోవువరకు వా రాగదిని విడిచిపోలేదు. నేనును వారికిఁ దగిన పరిహాసక్రియల