పుట:కాశీమజిలీకథలు -09.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణ కుటుంబము కథ

275

తీసికొనిపొండని కేకపెట్టెను చిత్తము చిత్తము. అని పలుకుచు వారు దాపునకు వచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుఁడు పుణ్యాత్మా! నాకుఁ గన్నులు కానుపింపవు చెవులు వినిపింపవు. దేహమంతయు నెండిపోయినది తినుదమన్నఁ బండ్లులేక నమలలేను. ఆఁకలి పెద్దగా బాధించును. ఏది తిన్నను జీర్ణముగాదు, వృద్ధత్వముకన్న బాధకరమైన యవస్థ యొకటిలేదు. పిల్ల వాండ్రకు ముసలితనము బాధయేమి తెలియును బాబూ ! నాకారసము దయచేసితివేని ఈ బాధ తొలఁగి సుఖింతునని కోరికొనుటయు నాక్షేపించుచుఁ గుమారుం డిట్లనియె.

అయ్యా! మీకు లోకజ్ఞానము చాలగలిగి యుండకపోవదు. తాను పెద్దకాలము యావనసుఖము లనుభవించెను. కావలసినంతమంది సంతానమును గనెను. ఒక్కనికి బెండ్లిఁ జేయలేదు. కూఁతురు పెండ్లి కెదిగియున్నది. చక్రవర్తికివలె మణుగుల కొలఁది బంగారము దీని పెండ్లికిఁ గావలసియున్నది. మాయింట జిన్న మెత్తు బంగారము లేదు. విక్రమార్క మహారాజుగారిని యాచించుటకై పోవుచుంటిమి. దారిలో మాపుణ్యవశంబున మీరు దారసిల్లి రసాయన మిత్తునని చెప్పుచుండ రసము కోరుటకంటె నవివేకమున్నదేమో యాలోచింపుఁడు. తాను చిన్నవాడైన లాభమేమి? తిరుగాఁ పెండ్లి యాడి సంతానము గనుట తప్ప వేరొక ప్రయోజనము లేదు. మీరీచిక్కులన్నియు నాలోచించి రసాయనమే దయచేసితిరేని కన్యాదానఫలము మీకు దక్కఁగలదు. మా చెల్లెలు కడు నభిమానస్థురాలు. దాని పెండ్లిని గుఱించి మే మిబ్బంది పడుచుంటిమని విని దుఃఖించుచున్నది. మీరాలోచించి మా కుటుంబ కలహము లేకుండఁ జేయుడని కోరెను.

విక్రమార్కుండు నవ్వుచు నౌను మీకు ధన మవసరమే. మీరన్న మాటయు నుచితముగానే యున్నది. మీ తండ్రిగారు వార్ధకబాధ పడలేక దానిం గోరిరి. అదియు నాలోచింపవలసినదే. కావున మీకు రసము రసాయనము గూడ నిచ్చువేయు చున్నాను. గైకొని పరమానందము వహింపుడు. బ్రాహ్మణులు తృప్తులైన శ్రీమహావిష్ణుండు తుష్టుండు నగునని పలుకుచుఁ దనకు బలిచక్రవర్తి పదిలముగా దాచికొనుమని చెప్పి యిచ్చిన రసము రసాయనము గూడ నా బ్రాహ్మణార్పితము గావించి గుఱ్ఱమెక్కి తా నవ్వలకుఁ బోయెను. దాతల కీయరాని వస్తువు లుండునా ?

శ్లో. రాజావరాహమనుధావ్య బిలం ప్రవిర్య
    దృష్ట్వాబలిం సమధి గమ్యచతుత్సపవ్యాం
    దత్తం రసాయన మవాప్యరసంచ విప్రా
    యాదాదితి ప్రతిమయా వినివేద్య తేద్య.

అని యెఱింగించువఱకు గాలాతీతమగుటయు మణిసిద్ధుండవ్వలి కథ పై మజిలీయం దిట్లు చెప్పదొడంగెను.