పుట:కాశీమజిలీకథలు -09.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తండ్రి - బాబూ! కోపింపకుము యయాతిచరిత్ర మెప్పుడైన వింటివా ? అరువదివేల సంవత్సరములు యౌవన సుఖము లనుభవించి తృప్తిబొందక తిరుగాఁ గుమారుని యౌవనము గ్రహించి సుఖింపలేదా ? వృద్ధులకోరికలు మీకుఁదెలియవు. నా కోరికతప్పులేదు. నిదానింపుము.

కుమా - నీవు తిరుగాఁ బెండ్లికొడుకవై సుఖింతువుగాక. మఱి నీ కూఁతుర నేమి జేసెదవు. దీనియెత్తు బంగార మెక్కడ దొరకును.

తండ్రి - విక్రమార్కుని కడ కరిగి యాచింతము అతండీయక పోవఁడు.

కుమా - ఈయనప్పు డేమి చేయఁ గలిగినది?

తండ్రి – ఇయ్యకున్న వేఱొక తెర వాలోచింతము తండ్రీ నా యభిలాష తీర్పుము. ఈ వార్దకము భరింప లేకున్న వాఁడ.

కూఁతురు — అన్నా! నాకుఁ బెండ్లి కాకున్న బలవన్మరణము నొందెద . నాన్న యభిలాషయే తీర్పుము. నా నిమిత్తమై యాయన కష్టపడనేల ?

కుమా - చెల్లీ ! ఈ ముసలివానిమాట విని సకలైశ్వర్య ప్రదమగు రసాయనము మాని రసము యాచించమందురా ? ఇంటికి బోయిన నమ్మ చంపివేయదా ? వీని పడుచుదనము వలన వచ్చిన లాభమేమి యున్నది. నేను రసాయనమే యాచించెదను.

తండ్రి - శుంఠవు. నీకెవ్వఁ డిచ్చును? ఆ పుణ్యాత్ముఁడు ఏమి కావలయు నని నన్నడిగెను కాని నిన్నడుగలేదు. నేను రసమే కో రెదను.

కుమా — నేనుమాత్ర మాయనతోఁ జెప్పలేనా యేమి? రజస్వలాభిముఖ యైన కన్యక యింటనుండఁ బెండ్లి జేయక తాను బదారేండ్ల బాలకుమారుఁడై యౌవన సుఖము ననుభవింపఁ దలంచు చున్నాఁడు. మీఁవృద్ధునిమాట వినక రసాయనమే యిమ్మని కోరెదను.

కూఁతురు - అన్నా !నా విషయమై మీ యిద్దరు తగవులాడ వద్దు. రసమే కోరనిమ్ము . నా పెండ్లి కై మీకేమియు భారము వద్దు. నేను బ్రహ్మచారిణినై యీ యడవిలోఁ దపము జేసికొనియెద. నే మృగమైన భక్షించిన గష్టమేలేదు.

కుమా - చెల్లీ ! నీవట్లనిన నా గుండె పగిలిపోవుచున్నది. కలిగిన సంతానము చాలక మన తలిదండ్రు లమ్మవారి గుడికిఁబోయి మ్రొక్కికొనిరఁట చేతఁ గాసు లేదు. నీయెత్తు బంగార మెట్లిత్తుమని మ్రొక్కికొనిరో తెలియదు. అమ్మ మేనఁ జిన్న మెత్తు బంగారమేన లేదుగదా? ఆఁడుపిల్లంగని సుఖ పెట్టుచున్నారు. అల్లుని విందులు వియ్యపరాండ్ర విందులు మనసు తీరినది. ఏమైనసరియే కాని తండ్రిగారికోరిక బాగులేదు అనిన వారు మువ్వురు తగవురాడుచుండగా నా మాటలన్నియు విక్రమార్కునికి వినబడుచునే యున్నవి. అతండు నవ్వుకొనుచునే నవ్వలికిఁ బోవలసి యున్నది. మీరు జాగుచేయుచున్నా రేల? వేగ వచ్చి యేదియో కావలసినది