పుట:కాశీమజిలీకథలు -09.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    సంభ్రాంతదృష్టి సహసైవ నమశ్శివాయే
    త్యుక్త్వార్థలజ్జితనతం ముఖనుంబికాయః

శ్రీ శంకరుని పాణిగ్రహణ మహోత్సవమునఁ దన చేతిఁ బట్టికొన మహేశ్వరుని హస్తమునందుఁ గంకణముగానున్న సర్పములంగాంచి జడియుచు నమశ్శివాయ యని సగము పలికి భర్త పేరు చెప్పినందులకు సిగ్గుపడుచుఁ దలవంచుకొనిన పార్వతీదేవి యొక్క ముఖము మీకు సకలైశ్వర్యములు నొసంగుఁ గాక యని యాశీర్వదించుటయు నా నృపాలుం డతండు పండితుండని తలంచి మీరెందుఁ బోవుచున్నారని యడిగెను.

ఆ వృద్ధునకుఁ గొంచెము బధిర ముండుటచే వినంబడక యేమనుచున్నారని కుమారు నడిగెను. ఆ వటుం డామాట బిగ్గరగాఁ జెప్పెను. అప్పు డా వృద్ధుండు సౌమ్యా ! నాకు నూరేండ్లు గతించినవి. మా కాపురము విద్యాసాగరము నేను జాల విద్యలు జదివితిని. వరుసగా నెనమండ్రు కుమారులుగలిగిరి. నా భార్య ప్రతి ప్రసవమునకు నాఁడుపిల్ల పుట్టునేమోయని చాల వేడుక పడుచున్నది. పురుషులే కలుగుచుండుటం బట్టి పరితపించుచు నొకనాఁడు నాతో నాథా ! నా కాఁడు వియ్యమందవలయువని చాల వేడుకగా నున్నది. అందఱు మగపిల్లలే పుట్టిరి. పండువుల కల్లునిఁ దీసికొని వచ్చుటయు విందులు సేయుటయుఁ బురుళ్ళు పోయుటయు లోనగు ముచ్చటలెల్ల నాఁడుపిల్లవల్లనే తీరవలయును. మనకట్టి భాగ్యము పట్టినదికాదు. కోడండ్రు కూఁతుండ్రగుదురా ? కాలు వంగినఁ గూఁతురు జేసినట్టు కోడలు చేయునా? అనియూరక నిత్యము నాకడఁ బరితపించుచుండ నాలోచించి యొకనాఁడు నేను నా భార్యను వెంటఁ బెట్టుకొని యాశ్రితకల్పలత యని పేరుపొందిన మా గ్రామదేవత గుడికిఁ బోయి నమస్కరింపుచుఁ దల్లీ? జగజ్జననీ ? మా కిదివరకు మగపిల్లలే కాని యాఁడుబిడ్డ పుట్టినదికాదు. ఆఁడుపిల్లకై నా యిల్లాలు మిక్కిలి యుత్సుకము జెందుచున్నది. దేవీ ? ఈ మాటు మా కాఁడుబిడ్డ పుట్టున ట్లనుగ్రహింపుము. నీ పేరు పెట్టెదము మఱియు వివాహ సమయమున నా బాలికయెత్తు బంగారముతోఁ జతుశ్శాస్త్ర పండితుఁడైన వరునకుఁ గన్యాదానము గావింతుమని మ్రొక్కుకొంటిమి.

ఆ మహాదుర్గ యనుగ్రహ మెట్టిదో పరికించితిరా ? వెంటనే యీ యాఁడుపిల్ల కడుపునం బడినది మొదలు నా భార్వ నిత్యము దుర్గగుడికిఁ బోయి యాఁడుపిల్ల గలుగునట్లు చేయుమని ప్రార్ధించుచుండునది. దేవీ కటాక్షము మాకీబిడ్డ పుట్టినది. ఆ దుర్గ పేరే పెట్టితిమి. కాని వివాహమునకు దీనియెత్తు బంగారమెట్లు తేఁగలము. మా పిల్ల కులశీలరూపాదులచే ననవద్యయై యున్నది కావునఁ జదివిన వరుండు లభించెం గాని యనుకొనినట్లు కన్యాదానముచేయ దీనియెత్తు బంగారు మెట్లు లభించును? వెనుక ముందు విచారింపక యప్పుడట్టి మ్రొక్కు మ్రొక్కుకొంటిమి. ఆఁడుదానిమాట వినుటచే ముప్పురాక మానదు. పిల్ల పుట్టినప్పటినుండియు బంగారము కొఱకు ప్రయ