పుట:కాశీమజిలీకథలు -09.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణ కుటుంబము కథ

271

మహాత్మా ! నీ పాదరజమునైనఁ బోలని నన్నీ భవనమునకు రప్పించి యాదరించితి వింతకన్న నధికమగు వరమేమి యున్నది. మఱియు మీ వాకిలి శ్రీవిష్ణు డెప్పుడు గాచుచుండునని చెప్పుదురు. అ జగదీశ్వరుఁ డిపు డిందున్నవాఁడా యెఱింగింపుమని యడిగిన నయ్యసురేంద్రుఁడు మందహాసముతో నిన్నుఁ జేయి పట్టుకొని నా చెంతకుఁ దీసికొనివచ్చి విడిచినవాఁడే విష్ణువు. మఱియు నీవు బురాణము వినుచుండఁ దనభార్య తటాకములోఁ బడెనని మొఱపెట్టి నీ సాహసము పరీక్షించి వైష్ణవులకుఁ దెలియజేసినవాఁడే లక్ష్మీవల్లభుండని యెఱిగించిన విభ్రాంతుడై విక్రమార్కుండు.

క. ఆహాహా మద్భాగ్యము
   నాహస్తయుగంబు నంటెనా ? మేల్మేలా
   శ్రీహరి నా కొరుఁడను సం
   మోహము గలిగించె మోసపోయితి నకటా?

గీ. ఎవ్వఁడో దాసు డని పరీక్షింపనైతిఁ
   గాని హరియని యెఱిఁగితినేని యతని
   పాదములు రెండు గట్టిగాఁ బట్టికొందు
   వదలుదునె నన్ను రక్షించువఱకుఁ దండ్రి !

అని యనేక విధంబుల నమ్మహాత్మునిఁ దెలిసికొని నందులకుఁ బరితపించు చుండ వారించుచు బలిచక్రవర్తి వత్సా! భవత్సాహస వితరణాది గుణగణంబులచే గట్టఁబడి శ్రీవత్సాంకుండు నీ వంకకే రాఁగలఁడు. నీవు విచారింపకుమని పలుకుచు గొన్ని దినంబులు దనచెంత నునిచికొని యందలి విశేషము లెఱింగింపుడు దత్ప్రీతికరముగా రసము రసాయము అను రెండు వస్తువులిచ్చి తత్ప్రాభావమెఱింగించి గారవింపుచుఁ దన భటులకు మునువచ్చిన గుహామార్గమున భూలోకమున విడిచిరమ్మని యాజ్ఞాపించుటయు వారట్లు కావించిరి.

బ్రాహ్మణ కుటుంబము కథ

విక్రమార్కుడందె దన గుఱ్ఱమునుఁ గాంచి మిగుల సంతసించుచు నెక్కఁబోవు సమయంబున నమ్మార్గంబున నూరేండ్లు గడిచిన యొక వృద్ధభూసరుని చేయి పట్టుకొని యొక బ్రహ్మచారియు నొక కన్యకయు వచ్చుచు నమ్మహారాజుం జూచి యందు నిలువంబడిరి.

విక్రమార్కుండు వారు బ్రాహ్మణులని యెఱింగి నమస్కారము గావించుచుండ నతం డెవ్వఁడో గొప్పవాఁడని తలంచి యా వృద్ధుం డిట్లాశీర్వాదము గావించెను.

శ్లో. భవద్గుణదాయి భవతోస్తుపినాకపాణేః
    పాణిగ్రహే భుజగకంకణభీషి తాయాః