పుట:కాశీమజిలీకథలు -09.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మణిమస్తకి యను జవరా లతనిసుగుణగణంబులు విని వివాహమాడ యత్నించు చున్నదని విన్నాను. మనుష్యుఁ డైననేమి ? సకలగుణగరిష్ఠుండు, దేవతలకుఁ గూడఁ బూజ్యుండగునని పలికెను. వారా రాత్రి పెద్దతడవు విక్రమార్కుని యశోవిసరంబుల నభినుతించిరి.

ఆ మాట లన్నియు విని విక్రమార్కుండు సిగ్గుపడుచు మదనమంజరి కృతజ్ఞతను మెచ్చుకొనుచు నఁట గదలి యా వీథింబడి పోవుచు నది రాత్రియో పగలో తెలియక విభ్రాంతుఁడై ఆహా ! ఈ నగరము వీథులకుఁ దుది మొదలు గనంబడుచున్నవి. బలిచక్రవర్తి యున్న నెల వెంతదూరమున్నదో తెలియదు. ఇది యురగనగరమని తోచుచున్నది. వీరుగూడ వేల్పులవలె సౌమ్యదర్శనులై యున్నారు. నా భాష తెలియకనేమో వీరు నా మాట కుత్తరమీయరు. కానిమ్ము. ఎప్పటికైన నవసానము చూడకపోవుదునా ? అని తలంచుచు మఱికొంత దూరము నడిచినంత నొకింత నోరఁగా నొక యుద్యానవనము గసంబడినది. అందుఁ గొందఱు నాగకన్యకలు విహరింపుచుండిరి.

వారి సౌందర్యాతిశయముఁ జూచి యాశ్చర్య మందుచు విక్రమార్కుం డల్లన నవ్వనోప్రాంతమున కరిగి యందొక లతాకుడుంగము మాటున నిలువంబడి వారి క్రీడాలాపము లాలించెను.

రత్నపదిక - సఖీ! మణిమస్తకా? నాటకము నందలి విక్రమార్క వేషము జూచియే యిట్టి మోహమందితి వేమనదగినది. మనకన్న మనుష్యులు తక్కువవారు. వారి వరింపఁగూడదు. నీ బుద్ది మరలించుకొనుము.

మణిమస్తక – నెచ్చలీ! విక్రమార్కుని వేషాభినయము జూచి వరించితి ననుకొంటివా యేమి ? చాలు చాలు. అతని చరిత్ర మంతయు జదివితిని. ఆహా ! ఆ పురుషసింహుఁ డెటువంటివాఁడనుకొంటివి వినుము౼

శ్లో. మహాకులీనత్వ ముదారతార
    తథామహాగ్య విదగ్ధభావా
    తేజస్వితా ధార్మికతో జ్వలత్వ
    మమీగుణాజాగ్రతి నాయకస్య

మహాకులీనత్వో దారత్వ మహాభాగ్యత్వ విదగ్దత్వధార్మికత్వో జ్వలత్వాది మహాగుణంబు లతనియంది నిరూఢములై యున్నవి. అధీరోద్దతుని మీఁద నా మనసు వాలినది మరలదు.

రత్నపదిక ౼ తరుణీ! మొన్న మనము జూచిన నాటకములో మలయవతి పెద్దభార్య యనియుఁ ద్రిపురసుందరి రెండవభార్య యనియు దెల్లమైనదిగదా? ఇరువురు భార్యలు గలవాని పొత్తు నీవేల నభిలషించుచుంటివి.

మణి - ఎంద ఱుండిన నేమి? ఆ భువనసుందరునికి భార్య యనిపించు