పుట:కాశీమజిలీకథలు -09.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

చెప్పుదురు. ఆ మాట వాస్తవమేనా? అమ్మహాత్ముని గృహ మెందున్నది? యెఱింగింపుడని యడిగిన వారిట్లనిరి

అయ్యా? యీ నగరమునకుఁ తుది మొదలు లేదు. ఇది వైష్ణవుల వీథి యండ్రు. మఱియొకటి రాక్షసులవీథి. మఱియొకటి యురగుల వీథి. అంతయు బాతాళలోకమే యని చెప్పుదురు. బలిచక్రవర్తి గృహ మీ నగరమధ్యమున నున్నది. ఎటనుండి పోయినను నేఁడు వాకిళులు దాటిపోయినంగాని యమ్మహాత్ముని దర్శనముగాదు. ప్రతి ద్వారమునందు శంఖచక్రగదాది సాధనహస్తులు శ్రీవత్సలాంధనులు ద్వాదశోర్ధ్వపుండ్రధారులైనవారు గాచియుందురు. అందు శ్రీవిష్ణుం డెవ్వఁడో తెలియదు బలిచక్రవర్తికిఁగల వైభవము మహేంద్రునికి లేదని యచ్చటి విశేషములన్నియు నెఱింగించిరి!

విక్రమార్కుం డక్కడికథ లన్నియు విని యబ్బుచు నందున్న వైష్ణవుల వలన బలిచక్రవర్తియున్న నెలవునకు మార్గము తెలిసికొని యొకవీథింబడిపోవుచు దారిలో ననేక విశేషములఁ జూచుచు నరిగి యరిగి క్రమంబున రక్కసు లుండువీథి సొచ్చి శ్రీవైష్ణవులకు నందలి రాక్షసుల నించుకయు భేదము గానక బలిచక్రవర్తి విష్ణుభక్తిగుఱించి ప్రశంసింపుచు నురగులవీథికిం బోయెసు. అందొక గృహపతి యఱుంగుపై నించుక సేపు విశ్రమించెను. లోపలి సంవాదమిట్లు వినంబడినది

ఉరగుఁడు - సకియలారా! స్వర్గమున కరిగి మీరింత యాలసించి వచ్చితిరేమి? జానకీపరిణయనాటకము జరిగినదియా? అందు మీరు వేషములు వైచితిరా? మీ రేభూమికలైరి.

నాగకన్యకలు — ప్రాణేశ్వరా! మేము మీ సెలవు భూని నాకమున కరిగితిమి. జానకీపరిణయము జరిగినది. అందు రంభ జానకివేషము వైచినది. మేమిద్దరము సఖులవేషము వైచితిమి. ఆ భాగములన్నియు వర్ణించితిమి. అది కడుచమత్కారమైన నాటకము.

ఉర - అందలి చమత్కార మేదియో కొంచెము వినిపింపుఁడు.

నాగ -- సీతారామలక్ష్మణు లడవిలోఁ బర్ణశాలలో వసించునప్పుడు ఖరాసురుఁడు రామునిఁ బరిభవించి రమ్మని విరాధు ననుపుటయుఁ దత్ప్రేరణంబున విరాధుఁడు శుకరూపము ధరించి రామలక్ష్మణులం గాంచి తత్తేజోపరిభూతచేతస్కుండై విజయాశ వదలి శ్రీరామరూపము ధరించి సీత నెత్తుకొనిపోవఁ దలఁచుచు నా ప్రాంతమందు వసించి సమయ మరయుచుండ శూర్పణఖ యరుదెంచి యతనిం గాంచి నీ విందేమిటికి వచ్చితివని యడిగినది. ఖరప్రేషితుండనై శ్రీరాముం జంపుటకై వచ్చితినని చెప్పెను. తానుగూడ రావణప్రేరితురాలనై శ్రీరాముని పరిభవించుటకే వచ్చితినని చెప్పినది. ఇరువురు మాటాడికొని చెరియొక దెసకుఁ బోయి కాచికొని యుండిరి.

సీత రాముని బిలిచి యీవలకు వచ్చెనేని రామవేషము వేసికొని యామె నెత్తుకొని పోవదలంచుకొని విరాధుఁ డొకమూలఁ బర్ణశాలఁ గాచికొనియుండెను.