పుట:కాశీమజిలీకథలు -09.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిచక్రవర్తి కథ

263

విధించియున్నాఁడు. మనము చూచుచుండవలసినదే కాని చెఱువు చేరఁగూడదని పెద్దగా నుపన్యసించెను.

ఆ వృద్ధబ్రాహ్మణుడు మొఱపెట్టుచుండ నాలించి యందుఁ బురాణము వినుచున్న విక్రమార్కుండు వెఱవకుఁడు నేనిదే మీ భార్యను విడిపించెదనని పలుకుచు గుభాలున నాతటాకములో నుఱికి కరవాలమున నా మకరముం బరిమార్చి యావృద్ధకాంతం బట్టికొని యొడ్డెక్కెను. అందఱు తెల్లబోయి చూచుచు నీ మహాపురుషుఁ డెవ్వఁడు? ఈ సాహసాంకుఁ డెవ్వఁడు? ఎందలివాఁడు? అని యాశ్చర్యముతోఁ జూచుచుండ నా వృద్ధబ్రాహ్మణుఁడు మహాత్మా! నా భార్యను బ్రతికించితివి నా యిల్లు నిలిపితివి. నీకు నేను బ్రతిక్రియ యేమియు జేయజాలను. గంగాతటంబునఁ బదిసంవత్సరములు గాయత్రీపునశ్చరణఁ గావించితి. తత్ఫలంబు నీకు ధారవోయుచున్నానని పలికి యట్లు గావించెను. అంతలో నాతటాకములోనుండి వికృతాకారుఁడగు నొక పురుషుఁ డరుదెంచి మహాత్మా! నేనొక గంధర్వుఁడ నైశ్వర్యమదమత్తుండనై తపోధనుం బరాభవించి మకరముగా శపింపఁబడితిని. నీచేఁ జంపఁబడి తజ్జన్మంబుఁ బాసితిని. నీవిప్పు డీవిప్రునివలన వడసిన గాయత్రీపునశ్చర్యాఫలంబు నాకు ధారవోసితివేని పూర్వరూపము గైగొందునని ప్రార్థించుటయు విక్రమార్కుండు మహాప్రసాదమని యప్పుడే యప్పుణ్య మతని కిచ్చివేసెను.

వాఁడు దివ్యరూపము ధరించి విక్రమార్కుని యశము గీర్తించుచు స్వర్గమునకు నిర్గమించెను. ఆ విచిత్రమంతయు నందలి వైష్ణవులు చూచి యబ్బురపాటుతో నతని చేరం జని మహానుభావా! నీవెవ్వండ మెందలివాఁడవు. ఇక్కడి కెప్పు డరుదెంచితివిఁ నీ వృత్తాంత మెఱుంగఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

నేనొక బాటసారిని. మార్గము దప్పి మీ నగరమున కరుదెంచితి ఇది యే పట్టణము. దీనింబాలించురా జెవ్వఁడు? ఇందలి పుణ్యపురుషులంజూడ వైకుంఠమువలె నొప్పుచున్నది. దీని వృత్తాంత మెఱింగింపుడని యడిగిన వారిట్లనిరి.

అయ్యా! ఇది మహాబలిపురంబు. దీన్ని బలిచక్రవర్తి పాలించుచున్నాఁడు. ఇది పాతాళలోకములో నొకభాగము. పరమభాగవతశిఖామణియగు బలిచక్రవర్తి నానాదేశములనుండి నూరువేల వైష్ణవ గృహస్థుల రప్పించి యిందుఁ గాపుర ముంచెను. ఇందు వైష్ణవగృహములు లక్షయున్నవి. ఇందలివారందఱు బలికాశ్రితులు గురువులును నిత్యము వీరు తీర్థప్రసాదములఁ దీసికొనిపోయి బలికిచ్చుచుందురు. వీరి సంరక్షణయంతయు బలిచక్రవర్తిదే యని యెఱింగించిన వెఱగందుచు విక్రమార్కుం డిట్లనియె.

ఆహా! ఏమి నాపుణ్యము నేను వరాహమూలమునఁ బాతాళలోకమునకే వచ్చితినా? ధన్యుడనైతిని. పరమభాగవతశిఖామణులు మీ దర్శనము జేసి కృతార్థుండనైతిని. మఱియు శ్రీమన్నారాయణుండు బలిచక్రవర్తి వాకిలిఁ గాచికొనియుండునని