పుట:కాశీమజిలీకథలు -09.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిచక్రవర్తి కథ

261

    ఏవేదికను జూడ గోవింద సత్కథా
                బారాయణాసక్త భక్తజనమె
    ఏదెస బొడగన్న ద్వాదశోర్వోరుపుం
                డ్రవిరాజితాంక వైష్ణవజనంబె.
గీ. ఏనివాసముగాంచిన శ్రీనివాస
   నామ సంతతసంకీర్తన స్వనంబె
   భళిర! పరికింప నీమహాపట్టణంబు
   హరికి నిరవైన వైకుంఠపుర వరంబొ.

అని తలంచుచు విక్రమార్కు డన్నగరవీథుల నడచుచుండ నొక్కండైన నీ వెవ్వడ వెందుఁ బోయెదవని పల్కరించినవాఁడు లేడు. ఊరక వీథులం దిరిగి తిరిగి యతం డొక దేవాలయము ప్రక్క తటాకము మ్రోల కల్యాణమండపములోఁ గూర్చుండి శ్రీవైష్ణవులు గొందఱు పురాణము జదువుచుండ విక్రమార్కుండు మెల్లఁగా నా మంటపము మీఁద నోరఁగా గూర్చుండి యా పురాణవిశేషము లాకర్ణింపుచుండెను. అప్పుడు కేశవాచార్యులు పురాణము చెప్పుచున్నాఁడు.

కేశవాచార్యులు -

శ్లో. అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః
    నిత్యం సన్నిహితోమృతః కర్తవ్యోధర్మసంగ్రహః.

దేహము క్షణభంగురము. విభవములు మెఱపుంన్నను దొందరగాఁ బోవునవ. ప్రతిక్షణము మృత్యువు దేహమునకు సన్నిధానమందే యున్నది. ఇట్టి స్థితిలో మనుష్యుండు చేయఁదగిన ప్రయత్నమేమి? ధర్మము సంపాదించుటకు సర్వదా యత్నించుచుండవలయు.

శ్రోతలలో నొకఁడగు మాధవాచార్యులు ఆహా హా! ఏమి శ్లోకమండి! ఇది యెట్టిసారమైనమాట! బాగు. బాగు! స్వామీ! ధర్మ మనఁగా నెట్టిదో సెలవిత్తురా.

కేశవ - చెప్పుచున్నాను వినుండు.

శ్లో. యోదుఃఖితాని భూతాని దృష్ట్వాభవతి దుఃఖితః
    సుఖితాని సుఖీచాపి సధర్మాత్మెతి శ్రూయతె
    నాతో భూయ స్త్సరో ధర్మః కశ్చిదన్యోస్తిదేహినః

ఎవ్వడు భూతములు దుఃఖింప దుఃఖించునో సుఖింప సుఖించునో వాఁడే ధర్మాత్ముఁడని చెప్పఁబడును. భూతదయకన్న నుత్తమధర్మము లేదు. ధర్మమనంగా దానికే రూఢియైనది. తెలిసినదియా?

మాధవా - మేలు. మేలు. బాగు బాగు. నాలుగు వేదముల యొక్కసారము చెప్పితిరిగదా, కేశవాచార్యా! తరువాత.