పుట:కాశీమజిలీకథలు -09.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యందుండుమని సంజ్ఞచేయుచుఁ జంద్రహాసంబుఁ జేతంబూని నిర్భయముగా నంధకార బంధురంబగు నబ్బిలంబునం బ్రవేశించి పోఁదొడంగెను. ఆ మార్గము పోయినకొలఁది చిన్నది కాఁజొచ్చినది. కొండంతపంది యం దెట్లిమిడినదో యని యచ్చెరువందుచు నయ్యసహాయశూరుండు మఱల దానికిఁ జాలినమార్గంబు నాకేల లేకపోవునని తలంచచుఁ బోవంబోవ మఱియు నా వరాహము హ్రస్వము కాఁజొచ్చినది. శరీరనిరపేక్షుండగు నాదక్షుండు తదంతము చూడక మరలువాఁడా? కొంతదూరము వంగియుఁ గొంతదూరము బాకియుంగూడఁ బోయెను. అంతలో నతని మేనికి గమనాయాసము వాయఁ జల్లనిగాలి విసరినది. బిలావసానము సమీపముననే యున్నదని తలంచుచు మఱి పదిబారలు సాగినంతట నించుక వెలుఁగు గనంబడినది. క్రమంబున నా బిలంబు పెద్దదగుట నడచుటకు వీలుపడినది అట్లు పోవం బోవ నా కందర మొక సుందరోద్యానవనంబునకుఁ దీసికొనిపోయి విడిచినది.

అయ్యుపవనవిశేషములం బరికించి యా నరపతి యవి యదృష్టపూర్వములగుట నపరిమితాశ్చర్యముతో నందు విహరింపుచు నా పోత్రి జాడ నించుకయుం గానక నలుమూలలు దిరుగుచుండ నల్లంతదవ్వుఁలో గనకరత్నగోపురప్రాకారసౌధాదులచేఁ బ్రకాశించుచున్న యొక పట్టణ మతనికి నేత్రపర్వము గావించినది

అప్పు డతం డోహో! ఇది నాకు స్వప్నమా యేమి? వెనుక మలయవతీ నగరమువలె నిదియుం గనంబడినదియా? కాదు కాదు. ఇది సత్యమే. వరాహమును దరుముకొనివచ్చి గుహామార్గంబున నిందుఁ జేరితిని. ఇది యే రాజు రాజధానియో కావచ్చును. ఈ నగరాభ్యంతరంబున కరిగి విశేషంబులం జూచి వెండియు నిందు వచ్చెద నీ కదళీవనంబు మొదటగదా? ఆ గుహ యున్నది. అని గురుతులు జూచుకొని మెల్లగా నా యుద్యానవనమార్గ మతిక్రమించి పట్టణాభిముఖముగా నరుగుచు నుభయపార్వ్శములం బరికింపుచుండెను.

ఉ. ఏనరనాథుఁ డీనగర మేలునొ? మేలు! తదీయవైభవ
    శ్రీ నుతియింప నొప్పు భళిరే! యలకాదిసురాలయంబులున్
    మానితరత్నహర్మ్య లసమానవిభావిభవాధిరామతన్
    దీని సమానమౌనని మదింతలపోయ పయారె! సత్ప్రభల్

అని తత్పురీరామణీయకం బభివర్ణించుచుఁ బోయి పోయి తదభ్యంతరంబు సొచ్చి స్ఫటికమణిగణఘటిత మనోహరములగు వీథులంబడి యరుగుచు నతం డాత్మగతంబున,

సీ. ఏవీథిఁ గనుగొన్న శ్రీవల్లిభుని గుణా
                  లాపసంవాదకోలాహలంబె
    ఏసౌధ మరసిన నిందారారపుచిహ్న
                  సుందరాలంకారశోభితంబె