పుట:కాశీమజిలీకథలు -09.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(33)

మన్మధ సంజీవిని కథ

257

శిలాశాసనమం దవ్విధానమంతయు వ్రాయఁబడియున్నది. అట్టి సాహసము జేయ నోపుదువేని యీ జన్మమునందే నీ యభీష్టము దీరఁగలదు.

అతిక్లేశభూయిష్టంబగు తపం బెక్కడ? నీవెక్కడ? యుత్తరజన్మ మెక్కడ పొమ్మని పలుకుచు నయ్యోగి మౌనముద్ర వహించెను. నే నతనిమాట వడుపున నప్పుడే బయలుదేరి కొన్ని దినంబులకు మహేంద్రగిరి చేరితిని. శిఖరమెక్కి దుర్గము దర్శించితిని. గుడి మ్రోలనున్న శిలాశాసనలిపిం జదివితిని. తైలకుండముల బరికించితిని. మేనగంపము జనించినది. అమ్మయ్యో! ఆ తైల మెంతకాలమునుండి యట్లు క్రాగుచున్నదియో? - తొంగిచూచుటకే శక్యమైనది కాదు. దానిగాలి సోకినంతఁ జర్మము మాడి పుండు బడినది. అందులో దుముకుట యెట్లు? చక్కని భార్యమాట దేవు డెఱుంగు నిప్పు డీ దేహపీడ యెవ్వడు భరింపగలఁడని తలంచి యా కుండమున కొక నమస్కారముజేసి దేవికి మ్రొక్కి యింటికిం జనుదెంచితిని.

ఇఁక బెండ్లియందు నాస మానితిని. కలిగినదానితో నతిథ్యభ్యాగతుల బూజించుచుఁ గాలము గడుపఁ దలంచుకొంటి. నా నడుమ విక్రమార్కు మహారాజు గారినిఁ జూడవలయునని తలంపు గలిగినది. కాని యేమిటికో మానివేసితిని. ఇదియే నా వృత్తాంతము. మీ పోలికఁజూడ గౌరవనీయులని తోచుచున్నది. మీ రాకవలన ధన్యుఁడనైతిని. రెండు దినము లిందు విశ్రమించి పోవుదురుగాక అని సబహుమానముగాఁ బలికిన సంతసించుచు నా నృపాలుం డిట్లనియె.

మిత్రగుప్తా ! నీ చరితము వినుటచే నాకుఁ గ్రొత్తవింత యొకటి వినంబడినది. నూత్నవిశేషములఁ జూచుటకే నేను దేశాటనము జేయుచుంటిని. నన్నా మహేంద్రగిరికిఁ దీసికొనిపొమ్ము. ఆ వింత నేనుగూడఁ జూచి యానందించెదనని పలికిన నతం డయ్యా? ఇందులకు నన్నింత బ్రతిమాలవలసిన పనిలేదు. పోదము రండు. నా కింటికడ జంఝాట మేమియును లేదుగదా, అని చెప్పెను.

విక్రమార్కుండు నాఁటి వేకువజామున లేచి యా బ్రాహ్మణకుమారుని తన గుర్రముపై నెక్కించుకొని యతం డెఱింగించిన మార్గంబునఁ బది దినముల కా మహేంద్రగిరి జేరెను.

అతం డా విప్రునితోఁ గూడ నా గిరి శిఖరమెక్కి యందలి శిలాశాసనము జదివి లక్ష్మినారాయణ సరస్సులో స్నానముజేసి దుర్గను సేవించి తప్తతైలకటాహము కడ కరుదెంచి యిదే యిదే చూడుమని బ్రాహ్మచారి పలుకుచుండి ముమ్మారు వలఁగొని కుండుగట్టెక్కి జయపరమేశ్వరా యని పలుకుచు విక్రమార్కుండు గభాలున కుత కుత నుడుకుచున్న యా చమురులో దుమికెను.

అప్పు డందున్న వారెల్ల హాహాకారములు గావింపుచుండ మిత్రగుప్తుండు ----------------- గోలున నేడ్చుచు నెట్టకేల కా గంగాళములోఁ దొంగిచూచెను. విక్రమార్కుని శరీర మంతయుఁ బిండమై యుడుకుచుండెను.