పుట:కాశీమజిలీకథలు -09.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

క. ఓ గుణనిధామా! నే
   నీగుణము గ్రహింప లేక నిన్నిక్కడికిన్
   లాగికొని వచ్చి చంపితి
   నీగురుపాతకము నెటుల నీగుదు నయయో!

అయ్యో! పుణ్యాత్మా! నీవా వింతఁ జూపుమని యడిగిన రాననక నీతో వచ్చి యిందు బలవంతమునఁ జంపితివి. ఇంత సాహసము గలవాఁడని యెఱుఁగక పోయితినే. ఇంచుకయు నా వేడికి వెఱువక గుభాలున దుమికితివిగదాఁ తండ్రి! నీ చల్లనిమాట లెట్లు మరచువాఁడ. అక్కటా! ఈ దుష్టుని సహవాస మేమిటికిఁ జేసితివి బాబూ! అట్లు బడిన మన్మథసంజీవని ప్రత్యక్షమగునని వ్రాయబడియున్నది గదా ఆ దేవత రాలేదేమి? ఇది వట్టిదని పలుకుచున్న సమయంబున,

సీ. పూర్ణేందు బింబవోలు నమ్మోముతో
                 తొలఁకులేనగవు వెన్నెలలతోడ
    నిందీవరములఁ గవ్వించు కన్నులతోడఁ
                 దళుకారు చెక్కుటద్దములతోడ
    కంధరంబు హసించి కబరికాభారముతో
                దరము సుందరము కంధరముతోడఁ
    గులుకు గబ్బి మిటారి గుబ్బ పాలిండ్లతోఁ
               గలదు లేదనుఁబొల్చు కౌనుతోడ
గీ. సరిపదార్వన్నె పసిఁడిమైచాయతోడు
   నమృతకలశంబు నొకచేతఁ గమలదామ
   మొక్కచేఁబూని వచ్చి యీచక్కి నిలచె
   ఠీవిమన్మథసంజీవినీ వధూటి.

గీ. ఈ శిలాశాసనము వ్రాసి యెంతకాల
   మయ్యెనోకద! భువి నొక్కఁడైన యిట్టి
   సాహసం బైచరించెనె? సాధుసాధు
   ఇప్పటికిఁ పూర్ణమయ్యె మదీయవ్రతము.

అని పలుకుచు మెఱుపు మెఱిసినట్లు మన్మథసంజీవినీ దేవత యా కుండంబునుండి యట్లా ర్భవించి నెల్లరు చూచి విస్మయపడుచుండఁ దనచేతనున్న కలశంబునందలి యమృతం బావిక్రమార్కుని మాంసపు ముద్దపైఁ జల్లుటయు దివ్య మంగళ విగ్రహముతో వెనుకటికన్నను మిక్కిలి యక్కజమగు తేజము కలిగి యమ్మహానుభావుండెదుర నిలువంబడియెను అప్పుడు మన్మథసంజీవినియు చేతులు జోడించి,