పుట:కాశీమజిలీకథలు -09.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దవు? నిత్యము వచ్చి యుపచారములు సేయుచుంటివి. నీ వేమి కోరి యిట్లు చేయుచున్నావని యడిగిన నమస్కరింపుచు నే నిట్లంటి.

మహాత్మా! నా పేరు మిత్రగుప్తుఁ డందురు. నేను బ్రాహ్మణకులుఁడను. నాకుఁ త్రిలోకసుందరి యగు భార్యతోఁ గాపురముఁ జేయవలయునని యభిలాష యున్నది. మా కులములో నందకత్తెలుండుటయే యరుదు. ఉండినను ధనహీనుఁడనగు నాకట్టి కన్యకల నెవ్వరిత్తురు? ఏమి తపంబు జేసినచో నట్టి భాగ్యము గలుగునో యెఱింగింపుఁడు. అట్టిదాని జపించి యుత్తరజన్మమునందైన నాకోరికఁ దీర్చుకొందు నిందులకే మి మ్మాశ్రయించు చుంటినని ప్రార్థించుటయు నాయోగి పకాలున నవ్వి యిట్లనియె

శ్లో. గగన నగరకల్ప స్సంగమో పల్లభావాం
    జలద పటలతుల్యం యౌవనం వా ధనం వా
    స్వజన సుతశరీరాదీని విద్యుచ్ఛలాని
    క్షణికమితి సమస్తం విద్ధి సంసారవృత్తం.

బ్రహ్మచారీ ? నీవుత్తమబ్రహ్మకులంబునం బుట్టియుఁ దపోధ్యయనాది విశేషములం దెలిసికొనక స్త్రీసంభోగవాంధం బొందితి వేల? స్త్రీసంగమము గగననగరము వంటిది. యౌవనము మేఘపటలములవలెనే చంచలమైనది. పుత్రమిత్రకళాత్రాదులు మెరపులవంటివారు సంసారము క్షణికమని యెఱింగి యీవెర్రి మానుము. చాలు చాలు, నీబుద్ధిని మరలించుకొనుమని నన్నుఁ బెద్దగా మందలించెను.

అప్పుడు నేనతని పాదంబులం బట్టికొని యోగీంద్రా! నీవు నాకోరికఁ దీర్పక తప్పదు. ఎన్ని జెప్పినసు నామనసు తిరుగదు. ఒక్క దినమందైన నట్టి భోగ మనుభవింపవలయును. లేకున్న బలవంతమున నీ పాదమూలమున మేనుబాసెదనని నిర్భంధించి యడిగిన నతం డాలోచించి యిట్లనియె.

విప్రకుమరా? మధ్యదేశములో విక్రమార్కుండను వదాన్యచక్రవర్తి యర్థికల్పవృక్షంబై యొప్పుచున్నాఁడని వాడుక మ్రోసియున్నది వింటివా? అతని నాశ్రయించిన నీ యభీష్టము దీరఁగలదు. అంతద వ్వరుగ లేనందువా? మఱియొక యుపాయము సెప్పెద నాలింపుము. ఇక్కడి కేబదియోజనముల దూరములో మహేంద్రగిరి యనుపర్వతము గలదు. తచ్చిఖరంబున దుర్గాలయమున్నది. ఆ దేవళము మ్రోల నినుప కటాహములో స్వయంప్రభూతంబగు నగ్నిచేఁ దైలం బెప్పుడును కుతకుత నుడుకుచుండును. ఆ దేవిం బూజించి యందుఁ బడితివేని నీ శరీరమంతయు నుడికి ముద్దగా నగును. అప్పుడు మన్మధసంజీవియను దేవకాంత వచ్చి యమృతము జల్లి బ్రతికించును. మిక్కిలి చక్కదనము గల యాదేవకాంత నీకు వశవర్తినియై యభీష్టకామంబులం దీర్పఁగలదు. అట్టి సుందరి భూలోకమం దెందును లేదు. అందున్న