పుట:కాశీమజిలీకథలు -09.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన్మధ సంజీవిని కథ

255

నందులకుఁ బ్రత్యుపకారమేమి జేయుదునని యాలోచించుచు నార్యా! మీయింట నాఁడువా రెవ్వరుఁ గనంబడరేమి? వివాహ మాడితివా? తలిదండ్రు లేమైరి? అని యడిగిన నతం డిట్లనియె.

అయ్యా! నాకథ విందురా? తలిదండ్రులు చిన్నతనమందే గతించిరి. ఇందు నాధారములేని విద్యార్ధినై దేశములు తిరిగితిని. శాస్త్రాభ్యాసము చేయుచున్నను నాకు శృంగారప్రబంధములయం దభినివేశ మెక్కువయైనది కామశాస్త్రములన్నియుం జదివితిని. కావ్యములు, నాటకములు దరుచుఁ బరిశీలించుచుందును. నేను జదివినవాఁడనని యూహించి యెవ్వరైనఁ బిల్ల నిత్తుమని వచ్చిన దత్కన్యకల బరీక్షించి చక్కనివారు కారని యంగీకరింపనైతిని.

శ్లో॥ ఏకా నారీ సుందరీవా దరీవా॥

అనునట్లుండిన రంభవంటి భార్య యుండవలయు. లేకున్న నడవులకుఁ బోయి తపము జేసికొనవలసినదే అని నిశ్చయించుకొంటి. నేను జదివికొను నప్పు డిరువురు రాజకన్యకలు గ్రహణస్నానమునకై నర్మదానది కరుదెంచిరి. వారికి సంకల్పముఁ జెప్పుటకై మా గురువువా రరుగగ వారితోఁగూడ నేను బోయి యా యెలనాగలం జూచితిని. ఆ మచ్చెకంటు లచ్చరలవలె నొప్పుచుండిరి. వారి శరీరచ్ఛాయ పదార్వన్నె బంగారమే! ఆహా! ఆ మోహనాంగులం జూచినది మొదలు నాకు మఱియుఁబిచ్చి యెక్కువయైనది.

అట్టి భార్యఁగలవాఁడెట్టి తపంబు గావించెనో యని ధ్యానించుచుందును. మఱియును,

ఉ. తలపయి మాలతీకుసుమదామము నెమ్మయిఁ గుంకుమంబుతోఁ
     గలపిన కమ్మతావి విరగందపుపూత లెడందరొమ్మునం
     దలికులనీలకుంతల మదాలస నీలసరోరుహాక్షియుం
     గలుగుట నింద్రభోగమనఁగాఁ దగదే మఱివేఱ యున్నదే?

మ. ఇంచుక ముద్దు లే నగవు లింపగునవ్యవిలాససూక్తు ల
     భ్యంచితలోలదృష్టియు నవారుణపల్లవమండలంబు ని
     ర్మించు సబీలయానములు మేలుగ యౌవనలక్ష్మితోడ వ
     ర్తించుమృగాదిచందములని ప్రమదంబు నటింపఁ జాలవే.

అని సుందరీసౌందర్యచాతుర్యాది విశేషములఁ దలఁచుచు బ్రాహ్మణకన్యకలయం దట్టిశృంగారలీలా వైదర్ధ్యములేమింజేసి యపరిగృహీతదారుండనై బ్రహ్మచారిగ నుండి తిరుగుచు నొకనాఁడు ప్రయాగలో మాధవమఠంబునకు మహాయోగి యొకండు గలండని విని యక్కడికిఁ బోయి మూఁడునెలలు వానికి శుశ్రూషఁ గావించితినిఁ నయ్యెగి నాదగు నకారణ శుశ్రూషకు మెచ్చికొని యొకనాఁడు నన్నుఁ జీరి నీ వెవ్వఁ