పుట:కాశీమజిలీకథలు -09.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

శిక్షింపఁబడిన బేహారిని విడిపించి వాని కీయవలసిన సొమ్మిప్పించి తనకు రాజిచ్చిన సొమ్మంతయు బ్రాహ్మణార్పణము గావించి నృపతి యనుమతి వడసి బ్రాహ్మణులతో గూడ వారాకాంత యింటి కరుదెంచెను.

అతని రాక కెదురు చూచుచున్న యయ్యుతివయు, దచ్చరణంబుల వ్రాలి మహాత్మా! నేను నీ పాదసేవకురాలనైతిని. పనులకు నియోగింపుమని పలికినఁ జిరునగవుతో నతం డిట్లనియె.

సుందరీ నీ వీ ధరణీబృందారకులం జూచితివా? వీరు పౌండరీకమను మహాక్రతువు సేయఁ దలపెట్టిరి. అందు మహావ్రతమగు సవనాంతర్భాగమున వేశ్యాసంభోగజనితంబగు బ్రాహ్మణశుక్లం బగ్నిహోత్రున కాహుతి సేయవలసిన విధి యున్నది కావునఁ దత్సవనంబు గణికాజన ప్రధానికంబని చెప్పుదురు.

నీవు వీరి వెంటఁ జని యయ్యజ్ఞంబునకుఁ గావలసిన సహాయంబు గావింపవలయు ననియే నా యాదేశము నీకునుఁ బుణ్యము రాఁగలదనిచెప్పి యొప్పించి యా యొప్పులకుప్పను వారి యధీనం గావించి యతం డాయూరు విడిచి యవ్వలఁ జనెను.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. యవ్వలి కథ మఱల నిట్లు చెప్పఁ దొడంగెను.

204 వ మజిలీ

మన్మధసంజీవినికథ

విక్రమార్క మహారాజు బ్రాహ్మణుల నట్లు సంతుష్టిపఱచి సువర్ణస్థంభదర్శనవ్యగ్రచిత్తుండై యా నగరము విడిచి యుత్తరాభిముఖముగా నరుగుచు నొకనాఁడు సాయంకాలమునకు నొక యగ్రహారము జేరెను. అప్పటికిఁ గొంచెము చీకఁటి పడుచుండెను. నడివీధిలోనున్న రావిచెట్టు మొదటఁ గట్టబడిన రచ్చబల్లపైఁ గూర్చున్న యొక బ్రాహ్మణకుమారుం డెటు పోవుటకుఁ దోచక నిలఁబడి యున్న విక్రమార్కుని జూచి వచ్చి అయ్యా ! తమ రెందుఁ బోవుచున్నారు? అని యడిగిన నతఁడిట్లనియె .

నే నొక బాటసారి నుత్తరదేశమున కరుగుచున్నాను. ముందరి గ్రామ మెంతదూర మున్నది? అని యడిగిన నా విప్రకుమారుండు ముందు దాపులో నే గ్రామము లేదు. నేఁటి కిందుండి పోవుదువుగాక మా ఇంటికిరండు ఆతిథ్యము పుచ్చుకొని పోవుదురుగాక అని పలుకుచు గుర్రపు కళ్ళెము బట్టుకొని మెల్లగా దనఇంటికిఁ దీసికొనిపోయెను.

గుఱ్ఱమును గట్టఁదగిన తావునఁ గట్టించి లోపలికిఁ దీసికొనిపోయి గౌరవించుచు నారాత్రి తానే వంటఁజేసి యా మహాత్మునికిఁ భోజనము పెట్టెను. భోజనానంతరమున విక్రమార్కుం డతఁడు జేసిన సత్కారమునకు మిక్కిలి సంతోషించుచు