పుట:కాశీమజిలీకథలు -09.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యేమి? జయంతుఁడు నన్నెక్కుడుగాఁ బ్రేమించుచుండ వాని నే నెందుల కాశింతును? ఇది దీని కల్పన సుప్రియ నడుగుము.

అరణ - నలకూబరుని యందము, పాటవము, దక్షత, జయంతుని కేమియును లేదు.

అలం - చాలు చాలు. నీ మాట నీవే మెచ్చుకొనవలయును. జయంతుఁ డెంత పరాక్రమవంతుఁడు? అనేక దేవాసురయుద్ధములలోఁ బేరుపొందిన శూరుఁడు. నలకూబరుని రంభాసంభోగసమరవిజయుండని మాత్రము పొగడుము.

అరుణ – నీవు పూర్వోత్తరసందర్భములు తెలియక వాదించుచుంటివి. ఇప్పుడు పరాక్రమముమాట యేమిటికి? జయంతుడు మహా పరాక్రవంతుఁడని నే ననుమతించెదను. నలకూబరుండువోలె సౌందర్యచాతుర్యకళావిదగ్దుండు కాఁడని నే ననుచుంటిని. తెలిసినదియా?

అలం – ఆతం డెంత నేర్పరియో నీ వేమి యెఱుంగుదువు. తిలోత్తమ నడుగుము, ఘృతాచి నడుగుము.

అరుణ - తిలోత్తమ జయంతుని పక్షమే పలుకక వే రెట్లు చెప్పును? ఒకరి నననేల? ఇందున్నవారి నందఱి నడుగుదము. నలకూబరుండు చక్కనివాడా? జయంతుఁడు చక్కనివాఁడా? శృంగారలీలావైదగ్ద్య మెవ్వరియం దెక్కువయున్నది. ఈ రెండు విషయములే మనమడుగవలసినది. అని యందున్నవారి నందరిని ఆ విషయమై పక్షపాతము విడచి న్యాయబుద్ధితోఁ జెప్పవలయునని యడిగిరి.

కొందఱు నలకూబరుండనియుఁ గొందఱు జయంతుఁ డధికుండనియుఁ జేతులెత్తిరి. లెక్కింప నిరుపక్షములవారు. సమసంఖ్య గలవారగుట నే పక్షమునకు గెలుపు గలుగదయ్యెను. ఆ విషయమై వారు పోట్లాడుచున్న సమయంబున నా దారిని నారదుం డరుగుచు నచ్చరులారా! మచ్చరముతోఁ బోట్లాడుచుంటిరేమని యడుగుటయు వారు సిగ్గుపడి యందరు లేచి చేతులెత్తి మ్రొక్కిరి.

అప్పుడు తిలోత్తమ వారి వివాదప్రకార మంతయు నెఱింగించి మహాత్మా! మీరు త్రికాలవేదులు. సర్వజ్ఞులు. జయంత నలకూబరులలోఁ గళావిదగ్దు డెవ్వఁడని యడిగిన నమ్మహర్షి నవ్వుచు జవ్వనులారా! అది మేము చెప్పవలసినదికాదు. ఈ నందనవనములోఁ గల్పవృక్షశాఖల పారావతశకుంతలములు రెండు గూఁడుకట్టుకొని కాపురము చేయుచున్నవి. అవి చాల తెలిసినవి. ఆ పక్షులకు వారిద్దరి తారతమ్యము తెలియు నడుగుఁడనిచెప్పి యమ్మునిపుంగవుం డెందేనిం బోయెను.

అప్పుడు అలంబుస తిలోత్తమా!సిగ్గు సిగ్గు. ఇటువంటి మాట లమ్మహర్షి నడిగెదరా! నేఁడు మన యదృష్టము బాగున్నది. శాంతస్వభావముతో నుత్తరముఁ జెప్పెను. కోపించి యేమని శపించునో యని గుండెలు చేతం బట్టుకొని యుంటి. గండము గడచినది. అయ్యయ్యో ఇటువంటి తుచ్ఛపుమాటల నడిగెదవా ?