పుట:కాశీమజిలీకథలు -09.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చరల కథ

29

సుప్రి - మనోరమ నడుగుము.

సుర - దాని సాక్ష్యమేల? నీవే చెప్పరాదా!

సుప్రి - సుధర్మామధ్యభాగంబునఁ జింతామణీపీఠంబున మహేంద్రుఁడు గూర్చుండఁ జుట్టును దిగువపీఠంబుల దిక్పతులు అనుచరులవలెఁ గూర్చుఁదురు. ఆయన లేచిన వీరందరు లేతురు. వీరిలో నెవరు లేచినను మహేంద్రుఁడు లేవఁడు. దీనంబట్టి వారి న్యూనాధిక్యములు తెలిసికొనవచ్చును.

సుర - ఇదియా! కారణము బాగుగ నున్నది. అది యింద్రుని యిల్లు. వారింటిలో వారియిష్టము వచ్చినట్లు కూర్చుందురు. అంతమాత్రముననే యధికుం డనరాదు.

సుప్రి - కేశినీ! దీనికేమియుం దెలియదే? నీ వైనం జెప్పుము.

కేశి - ఆ విషయము నాకంతగా తెలియదుకాని వారిద్దరి పుత్రులు సమానప్రతిపత్తిగాఁ దిరుగుటఁ జూచితిని.

సుర - నీ వలకాపురములో జరిగిన సభకు రాలేదు. కనుక నింతగా వాదించుచుంటివి. కుబేరుని యింటనున్న యొక రత్నమునకు నింద్రుని యెశ్వర్య మంతయు సరిపడదు.

అలం - చాలు చాలు. ఊరకొనుఁడు. నేనొకటి చెప్పిన మఱియొకవాదములోఁ దిగెయెద రేల?

అరు - గరువము రంభకు గాక మనకేలఁ గలుగవలయును? దేవవేశ్యలలోఁ బేరుబ్రతిష్టలు దానికే గలవు. ఎప్పుడు మేళముగట్టినను రంభయో, యూర్వశియో, తిలోత్తమయో, మంజువాణియో, ఘృతాచియో ముందు నాట్యము చేయుచుండ మనము వెనుక నిలువంబడి తాళము వాయించుట తప్ప ఎప్పుడైన గజ్జెఁగట్టి ముందుకు బోయితిమా యేమి? రంభయందు నీకింత యసూయ యేమిటికి?

అలం – రంభ మాత్రపు సౌందర్యము ఆటపాటలు నాకునుం గలవు. పెక్కుసారులు దేవతాసభలలో నాట్యములుచేసి బిరుదములందితిని. నీ వెఱుంగవు కాఁబోలు. నేను వెనుక నిలువంబడుదానను కాదు.

అరు - నీ యెదుట నాడినఁ గోపముగాని రంభకంటె నెక్కువ గర్వము నీకునుం గలదు. నావంటి యందకత్తె లేదని నీకు మనసులో నున్నది. నలకూబరుఁడు నీకుఁ గావించిన పరాభవ మెవ్వరికిం దెలియదనుకొంటివా యేమి ?

సురత - అక్కా! ఏమి గావించెనో చెప్పుము.

అరు - ఏమియును లేదు. నలకూబరుని వలచి యిది నందనవనములో నతఁడు విహరింపుచుండ నాసపడి వెనువెంట దిఱిగి యాశ్రయించినది. దీని మొగమైన నతఁడు చూడలేదు. అందులకే దీనికి రంభపై కోపము.

అలం - ఓహోహో! నలకూబరుడు జయంతునికన్న నందమైనవాఁడా