పుట:కాశీమజిలీకథలు -09.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తిలోత్తమ లోనగు ప్రసిద్ధదేవకాంతలెల్ల వారిలోనివారే వారిలో బదునాలుగు జాతులు గలవు. పంచభూతములు, సూర్యచంద్రులు, సముద్రము, బ్రహ్మ, మృత్యువు, మన్మధుఁడు, వేదములు దక్షపుత్రికలగు మునియు, నరిష్ట ఈ పదునాలుగురు నచ్చరలకు కూటస్థులు. మునియరిష్టలవలననే గంధర్వులు కూడ నుదయించిరి. గంధర్వకులమునందు స్త్రీ పురుషజాతులు రెండునుం గలవుగాని యచ్చరలలో బురుషజాతి లేదు. దేవలోకముల నన్నిఁట వారు స్వేచ్ఛగా విహరింపుచుందురు. అమరులు తమ యిచ్చవచ్చిన యచ్చర నేరికొని మిథునముగా విమాన మెక్కి తిరుగుచుందురు. వారికి వివాహములు లేవు. జరలేదు. చావు లేదు. నిత్యయౌవనులు. వారికి శృంగారలీలలుతప్ప నితర వ్యాపారములులేవు. ఒకనాఁడు కొందఱు అచ్చరలు నందనవనములోఁ బుష్పావచనముఁ గావించి పొలసి యలసి కల్పతరుకుసుమకిసలయవరాగవాసితములగు నమృతసరస్తోయముల జలక్రీడ లాడుచు నిట్లు సంభాషించుకొనిరి.

అలంబుస – మిశ్రకేశీ! మొన్న రంభ చేసిన వ్రతమునకు నీవు వచ్చితివా? దాని కెంత గర్వ మనుకొంటివి? తాంబూలమాల్యానులేపనాదులు స్వయముగా నీయక మరియొకరిచేత నిప్పించినది. తనపాటి చక్కఁదనము మనకు లేదనియా యేమి ?

మిశ్రకేశి – అది చక్కఁదనము గరువము కాదు. ఐశ్వర్యమత్తత. నలకూబరునకు నచ్చిన ప్రియురాలినని.

విద్యుత్పర్ణ – అతఁడు ఇంద్రసూనుండగు జయంతునికన్న నధికుండా యేమి? తిలోత్తమ కంతగరువము లేదేమి ?

తిలోత్తమ — నలకూబరుని రంభయం దెట్టి ప్రీతియో యట్టి ప్రీతి జయంతునకు నాయందుఁ గలదా యేమి? దానివలె నెందులకు గర్వపడుదును?

అరుణ - మనప్రభుపుత్రుఁడు జయంతునకన్న గొప్పవాఁడా యేమి నలకూబరుఁడు?

సురజ - ఇంద్రుఁ డధికుఁడా? కుబేరుఁ డధికుఁడా?

సుప్రియ - సరి సరి. ఇది బొత్తుగా ముగ్ధవలె నున్నది. దిక్పతులకెల్ల నధికుం డింద్రుఁడా కాఁడా?

సురజ - అయిననేమి? కుబేరునకు జగత్పతియగు మహేశ్వరుని మైత్రి యున్నది. దానింజేసి కుబేరుఁడే యధికుఁడని నా యభిప్రాయము.

సుప్రియ – మీ రెప్పుడు దేవసభకు మేళమునకురాలేదా యేమి? ఆ సభలో నింద్రుఁడెక్కడఁ గూర్చుండునో కుబేరుఁ డెక్కడఁ గూర్చుండునో ఈశానుఁ డెక్కడఁ గూర్చుండునో చూచినచో వారి వారి తారతమ్యములు దెలియఁబడఁగలవు.

సురజ — ఎట్లు కూర్చుందురు ?