పుట:కాశీమజిలీకథలు -09.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తెలిసికొని పెక్కండ్రు మూఁగి బేరములు సేయదొడంగిరి. విక్రమార్కుం డిట్లు బేరము సెప్పెను. ఈ గుర్రము వెల పదివేలు. సొమ్మంతయు నిప్పు డిచ్చివేయవలయును. నెల దినముల లోపల వడ్డీతోఁ బదొకండు వేలిచ్చినేని నా గుర్రము నా నా కిచ్చివేయవలయును. ఈ నియమముల కొప్పుకొనియే దీనిం గొనవలయునని ప్రకటించెను.

తల్లక్షణంబుల నెఱింగిన బేహారి యొకండా విధుల కొడంబడి యప్పుడే యా సొమ్మిచ్చి యా యశ్వరత్నమును గైకొనియెను. పిమ్మట నా నృపాలుం డా విత్తమంతయు నా భూసురోత్తమున కర్పించి నమస్కరింపుచు మహాత్మా ! మీరు నన్నపుడు దాహమిచ్చి బ్రతికించితిరి. మీకుఁ దగిన యుపకారము జేయలేకపోయితిని. ఇప్పటికి దీనందృప్తిఁబొంది యింటికి దయచేయుఁడు. సంవత్సరము దాటిన పిమ్మట నెప్పుడైన నుజ్జయినీ పురంబునకు రండు. నా కాపుర మా పురమే. విక్రమార్కునితో జెప్పి తగిన పారితోషిక మిప్పింతునని పలుకుచు నా విప్రుని సంతోషపెట్టి యంపివేసెను.

తన యశ్వరత్నము వారి వెంటఁ బోవక చిక్కులు పెట్టుచుండఁ జూచి దాపునకుఁ బోయి దువ్వుచు దురంగ సార్వభౌమా! నీ మూలమున నేనా బ్రాహ్మణుని ఋణము దీర్చుకొంటి. నీవు జేసిన మేలు నా కెవ్వరుం జేసియుండలేదు. నా యావజ్జీవనము నీ మేలు మఱచువాఁడను కాను. నీకును దీనఁగొంత సుకృతముగలుగఁ గలదు. పరోపకృతికన్నఁ బురుషునకు సార్థకమైన పని వేఱొకటి లేదు. పదివంతులు గడుపు లోపల వీరి సొమ్మిచ్చి వేసి నిన్నుఁ దీసికొన గలను. విచారింపకుమని కన్నీరుఁ దుడుచుచు బుద్ధులు చెప్పి వారి కర్పించుటయు నది సంకలింపుచు సంతోషముతో వారి వెంటఁ బోయినది.

పిమ్మట విక్రమార్కుం డానలువురు బ్రాహ్మణుల వెంటఁబెట్టికొని యొక వీధింబడి పోవుచుండ నొక చాటింపు వినంబడినది. అందు ఈ నగర ప్రాగ్భాగముననున్న యెడారిలో రేపు మూఁడు గంటలకు గుఱ్ఱపు పందెములు ప్రారంభింతురు. అందులకు వచ్చువారందఱు నుదయ మారుగంటలకే హజారమునకువచ్చి పేరులువ్రాయించుకొని పోవవలయును. మొదటి పందెము లక్ష, రెండవ పందెముఏబదివేలు. మూఁడవ పన్నిదము ఇరువదివేలు. నాలుగవది పదివేలు అని యున్న పత్రికల బంచిపెట్టుచుఁ జాటింపుచున్నారు.

ఆ పత్రికం జదివికొని విక్రమార్కుండు. మిక్కిలి సంతసించుచు విప్రులారా ! ఇఁక మీ జన్నము పూర్తికావచ్చును. ధనాగమోపాయము దైవము జూపట్టెను. గుఱ్ఱ మెక్కి నేనీ మొదటి పందమే గెలువఁగలను. సందియము లేదు. మీరు వచ్చిన వేళ మంచిదేయని చెప్పిన నుబ్బుచు వారిట్ల నిరి.

వదాన్యమణీ ! నీవు విక్రమార్కుని కన్న నధికుండవని తోచుచున్నది.