పుట:కాశీమజిలీకథలు -09.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావతి కథ

247

మా భాగ్యవశంబున నీవు మొదటి పందెము గెలిచినచో నా సొమ్మంతయు మాకిత్తువా? అనుటయు నతండు నవ్వుచు నా కేమియు నక్కరలేదు కాని ముందుగా గుఱ్ఱమును విడిపింపవలయును. దానికి బదొకండు వేలు కావలయు నెందైన నప్పుదేఁగలరా ? ఆసొమ్మంతయు మీ కిత్తునని పలికిన వారిట్లనిరి.

పుణ్యపురుషా! మేమా మాత్రము సమర్థులమైనచో నింతదూర మేల వత్తుము మమ్ము నమ్మి సొమ్మెవ్వరిత్తురు. మీరే యాలోచింపవలయునని పలికిరి. అప్పుడు విక్రమార్కుండు ఆలోచించి వెంటనే యా వర్తకునియొద్దకుఁ బోయి సార్థవాహా! ఈ యూర గుఱ్ఱపు పందెములు జరుగుచున్నవి. రే పీ గుఱ్ఱము నా కొకసారి యెరువిత్తువా? గెలిచిన సొమ్ములో నాలుగవవంతు నీ కిత్తునని యడిగిన నతం డందుల కియ్యకొనఁ డయ్యెను.

ప్రభావతికథ

ఆ ధన మప్పుడుగుటకై యా విప్రుల వెంటనిడుకొని విక్రమార్కుం డా యూర ధనవంతుల నరయుతలంపుతో వీధులందిరుగుచుండ నొకచో బెద్దమేడ గనంబడినది. అది భాగ్యవంతులదని తలంచి సింహద్వారము దాపునకుఁ బోయి లోపలి వారిం బిలువఁదలంచుచు నలుమూలలు పరికింప నందొక ప్రకటనపట్టము వేలఁగట్టబడి యున్నది.

ఇది ప్రభావతి యను వేశ్యయిల్లు. ఈ వారకాంత తన ప్రక్కకు కరుదెంచిన యుత్తమవంశస్థుడగు సరసున కొకరాత్రిఁ బదివేలు రొక్కమీయఁ గలదుఅని యా బల్ల యందు సువర్ణాక్షరములతో వ్రాయఁబడి యున్నది. దానిం జదివికొని విక్రమార్కుం డోహో ! ఇది మిక్కిలి వింతగానున్నదె గణిక యెప్పుడును సరసుని వలన వస్తువాకర్షించును గాని విటున కిచ్చుట నెందునుం జూడలేదు. ఇందుల కెద్దియేని కారణముండక పోవదు. ఉండుఁగాక నేనీ రాత్రి దీనియింటఁ బండుకొని యాసొమ్ము బుచ్చుకొని రేపు గుఱ్ఱమును విడిపించెద మంచి యాధారమే దొరికినదని సంతోషముతో ముచ్చటింపుచున్న సమయంబున నా దారిం గొందఱు పౌరులు పోవుచు వారిగుజగుజములు విని నవ్వుచు నిట్లనిరి.

అయ్యలారా! మీరు పరదేశులు కాఁబోలు. అందలి ప్రకటన జదివికొని మరియుచున్నారాయేమి? చాలు చాలు ఇటు రండు. అది వారకాంత కాదు. మృత్యు ముఖము. ధనాశాగ్రశిత మానసులై పెక్కండ్రు దానింటికిం బోయి యమలోకంబున కరిగిరి. ఆ వేశ్య జగన్మోహనాకారము గలదియే కాని దాని నొక బ్రహ్మరాక్షసుఁ డావేశించియున్నవాఁడట. రాత్రి విటుఁడు వోయి దాని నంటినతోడనే యా రక్కసుం డామెను వదలి వానికుత్తుక నొక్కి చంపి రక్తము పీల్చునఁట. పదిదినముల కొకసారి యైన నరరుధిరము దానవున కబ్బనిచో నా వేశ్యనే బాధించునఁట. అందుల కీలంజ