పుట:కాశీమజిలీకథలు -09.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగారు స్థంభము కథ

245

గదా. విక్రమార్కా! మార్గమధ్యమంబున ననేక కష్టములుపడి నీ చెంత కరుదెంచు చుంటిమి. నీవు మిగుల దాతవని విని యీ యజ్ఞము జేయింపక బోవుదురా అని తల పెట్టితిమి. ఏదియుఁ గాకపోయినది. అని విచారించిరి.

పేరా - అయ్యా! నిలఁబడియెద రేమిటికి? గుర్రమును నడిపింపుఁడు. వీరి యజ్ఞమునకై దేవతలు వాచియున్నారు కాఁబోలు. విధాయకకృత్యము చేయలేకున్నాము. యజ్ఞయాగము లెట్లుసాగును?

విక్ర - అయ్యా! మీరు విచారింపకుఁడు. నా వెంట రండు. తోసిన సహాయమేదైన జేయుదుంగాక.

పేరా - ఏమండోయి. మీరు వీరిని రమ్మనుచున్నారు ఈ గుర్రమును నా కిచ్చివేసితిరిగదా? దీనిలో గవ్వయైన వానికీయనీయను. తరువాత మీ యిష్టము. వారిదారిని వారిం బోవుదానిని నెత్తికి రాచుకొందురేల? మీరు మెత్తనివారువలెఁ దోచుచుంటిరిగదా.

బ్రాహ్మ - బాబూ! వాని యసూయపర్వతము దెలిసికొంటిరిగదా ? తనకే కాని యెవ్వరికి నెవ్వరు నేమియు సహాయము జేయగూడదు కాఁబోలు. మీరు పరోపకార పారీణులవలెఁ గనంబడుచుంటిరి. మీరెవ్వరు స్వామీ ?

విక్ర - నేనొక బాటసారిని. మీ పరిదేవనము విని యోపిన సహాయము జేయుదునంటి. నా యొద్ద ధనముండికాదు.

పేరా - పాపము. నిజముగా వీరియొద్ద నేమియును లేదు. జాలిగలవాఁ డగుట నా దరిద్రము విని యీ గుర్రము నా కిచ్చివేసెను. ఇఁక మీకే మీయఁగలడు ? మీ రెందేనిం బొండు.

విక్ర - (నవ్వుచు) అవధానిగారూ ! మీకిచ్చినది మరలఁ బుచ్చుకొనను మీరు విచారింపకుఁడు. వారు మనవెంట వచ్చిన మీ కేమి కొదవ యున్నది ? రానీయుఁడు.

బ్రాహ్మ - అయ్యా ! తమ సాహసము స్తుత్యమై యున్నది. కాని మీ యొద్ద నేమియు లేదనుచున్నారు. మా గోరిక కొలఁది కాదు. ఎట్లు పూర్తిజేయ గలరు?

విక్ర - అది నే నిప్పుడు చెప్పజాల, వచ్చిన రండు. అని చెప్పుటయు వారు కప్పు డింకొక తెఱవు లేమింజేసి మఱలి యాతనివెంటఁ బోవుచుండిరి విక్రమార్కుండు తన యంగసౌష్టవము తెల్లముగాకుండు నట్లేదియో మైపూతఁ బూసికొని కారణంబున సామాన్యుఁడువలె గనంబడుచుండెను. వారందరుంగలసి నడచుచు నాలుగు దినంబులకుఁ జంద్రగిరి యను పట్టణంబుజేరి సత్రంబున బసఁజేసిరి.

విక్రమార్కుం డా నాఁడు సాయంకాల మంగడికిఁ దీసికొనిపోయి యా వారువము నమ్మఁజూపెను. దాని లక్షణములు పరీక్షించి యుత్తమజాతి యశ్వంబని