పుట:కాశీమజిలీకథలు -09.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

పోవుదమని పలికిన సంతసించుచు నా భూసురుం డయ్యా ! నీవు గుఱ్ఱమెక్కి ముందుగా నడువుము. నేను మెల్లగా వత్తునని చెప్పిన నొప్పుకొనక యీ గుఱ్ఱము మీ సొమ్మైనది బ్రాహ్మణాధీనమైన వస్తువుల ననుభవింపఁ గూడదు. మీరు దీనిపై నెక్కి జూలు పట్టుకొనుఁడు కళ్ళెము పట్టుకొని మెల్లఁగా నడిపింతునని చెప్పిన నయ్యో! నేను గుఱ్ఱమెక్కఁ గలనా? యూరకయే వణకుచుందును. మీరె యెక్కుఁడని నిర్బంధించెను.

విక్రమార్కుఁడు నిర్బంధించి నా విప్రుని బలవంతమున నా గుఱ్ఱముపై కెక్కించి జూలు పట్టించి తాను కళ్ళెము పట్టికొని మెల్లగా నడిపించుచుండెను. అట్లు రెండు మూఁడు పయనములు జరిగించిన పిమ్మట దారిలో మఱి నలువురు బ్రాహ్మణులు దారసిల్లి గుఱ్ఱముపై యవధానిం జూచి నవ్వుచు నిట్లనిరి.

బ్రాహ్మణులు - ఇదేమిటోయి పేరావధానీ ! యీ వైభవ మెక్కడినుండి వచ్చినది ?

పేరావధాని - నన్ను మీతోఁ గలిపికొని రానిచ్చితిరి కారుగదా. కానిండు భగవంతుఁ డేదియేని దారిఁ జూపకుండునా యేమి. వేగఁ బొండు. విక్రమార్కుండు మీ యజ్ఞమును శీఘ్రముగాఁ జేయింపఁగలడు.

బ్రాహ్మ - అట్లనుచుంటివేల ? అచ్చటి వర్తమానములు నీకేమైనం దేలిసినవియా యేమి ?

పేరా - తెలిసినవి పొండు. మీతోఁ జెప్పనవసరములేదు.

విక్ర - మీ రెందుఁ బోవుచున్నారు ?

బ్రాహ్మ - ఉజ్జయినీ నగరమునకు.

విక్ర - అందేమిపని యున్నది ?

బ్రాహ్మ – మేము పౌండరీకమను సవనము దలపెట్టితిమి. ఆ యజ్ఞము విక్రమార్కుని జేయించుమని యడుగుటకై పోవుచుంటిమి. అది నలుబది దినముల క్రతువు దినమున కొక వేయి రూప్యములు కావలయు నమ్మహారాజు దీనిఁ జేయించు నందురా ?

విక్ర - (విచారముతో) ఆ రాజిప్పుడు దేశాటనము జేయుచుండెనని విన్నాను. సంవత్సరమువఱకు రాఁడని తెలిసినది.

పేరా - వీరిం బోనీయుఁడు ఇక్కడ జెప్పనేల ? అక్కడికిఁ బోయినఁ దెలియదా యేమి ? మనము పోవుదము నడువుఁడు.

బ్రాహ్మ - అయ్యసూయాపరుని మాటలకేమిగాని బాబూ మీరు నిజము చెప్పుడు. విక్రమార్కుం డూర లేఁడా ?

విక్ర - లేని మాట వాస్తవమే.

బ్రాహ్మ -- అయ్యయ్యో ! మా యాశ యంతయు భగ్నమై పోయినది