పుట:కాశీమజిలీకథలు -09.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగారు స్థంభము కథ

243

మందున్నది. ఏండ్లుగడిచిన తరువాతఁ బెండ్లి యాడితిని. సంతానము గలిగినది. దరిద్రబాధ పడలేక యుజ్జయినీ పురంబున విక్రమార్కుండను మహారాజు, అర్ధికల్పవృక్షంబై యాచకుల భూపతులం జేయుచున్నాఁడని విని యా ధర్మాత్మునిం జూడఁ బోవుచున్నాఁడ నా నగర మిక్కడి కెంతదూరమున్నది బాబూ ?

విక్ర --- పదిదినముల పయనములో నున్నదికాని ఆతం డిప్పు డూర లేఁడు గదా పాపము. చాల శ్రమపడి పోవుచున్నారు. సంవత్సరము వరకు రాఁడని విన్నాను.

బ్రాహ్మ - హా! పరమేశ్వరా! అని నేలంబడి మూర్చిల్లెను.

విక్ర - లేవనెత్తి? విప్రోత్తమా! ఇట్లు దుఃఖించెద వేమిటికి? భూలోకమున నాఁతడే వదాన్యుఁగా యేమి ? మఱియొకని నాశ్రయింపరాదా ?

బ్రాహ్మ -- ( లేచి ) అయ్యో ! నా దరిద్రదేవత నాకంటె ముందుగా వచ్చినదే? అడుగామడగా నడచుచు గంపెడాసతో మార్గఖేదము గణింపక వచ్చుచుంటి. ఇల్లు బయలుదేరి మూఁడునెలలైనది కాళు లెట్లు పొక్కు లెక్కినవియో చూడుడు అక్కటా! విక్రమార్క? నీ దర్శనమగును నా యిక్కట్టులెల్ల బాయునను సంతసముతోఁ గష్టములు లెక్క సేయక వచ్చుచుంటిఁ దండ్రీ నే నిప్పుడేమి జేయుదును? నెందుఁ జొత్తు నాకిఁక మరణమే శరణము తిరుగా వట్టిచేతులతో నింటికిం బోఁగలనా ? అని దుఃఖించుచుండ వారించుచు విక్రమార్కుం డాత్మగతంబున నిట్లు తలంచెను.

అయ్యో ! ఈ బ్రాహ్మణుని పరిదేవనము వినలేకున్నాను. ఇచ్చుటకుఁ జేతఁ గాసైన లేదు. తిరుగా నింటికిం బోయితినేని నా మిత్రులు గదలనీయరు. వీరి దరిద్ర మెట్లు పోఁగొట్టగలనని యాలోచించుచు నయ్యా! ఊరక యేల దుఃఖించెదరు? మీ కానృపతి యేమిచ్చునని తలంచి యరుగుచున్నారో చెప్పుఁడు. మీ దుఃఖము జూడ లేకున్నాఁడ. నీ గుఱ్ఱమమ్మి వచ్చిన సొమ్మిచ్చువాఁడ. మీ యాశయ మెఱింగింపుడని యడిగిన నించుక ధైర్యముతో నిట్లనియె.

పుణ్యాత్మా? విక్రమార్కుండు చూచిన వేయి మాట్లాడినఁ బదివేల నిచ్చునని చెప్పుకొనుచున్నారు. నేను వేదము తలక్రిందులుగాఁ జెప్పగలను. ఇట్టి నాతో సంభాషింపకుండునా? పదివేలైన దొరకకపోవునా ? అని యాసతో వచ్చితిని. బాబూ ! ధర్మాత్ములు దేశమంతట నున్నారు. ఈ గుఱ్ఱము నా నిమిత్తమై యమ్మి వచ్చిన సొమ్మిత్తునని చెప్పి నా దుఃఖము కొంత పోగొట్టితివి. నీవా విక్రమార్కుని కన్న నెక్కుడ వదాన్యుండవువలె నున్నావు. తండ్రీ ఈ గుఱ్ఱమునకేమి వెలయిత్తురు. చెప్పుమని యడిగిన నమ్మహారా జిట్లనియె.

పారుఁడా ! ఈ వారువమునకు నీ కోరిన విత్తము రావచ్చును. ఇది యుత్తమజాతి వీతి. దీనిం గొనఁ దగినవాఁడు దొరకవలయుంగదా. వెనుకకురండు