పుట:కాశీమజిలీకథలు -09.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గీ. దివ్యమాణిక్యకిరణదేదీప్యమాన
    కాంచనాభరణాలంకృతాంచితాంగి
    యగుచు నా రాజుసుత సఖుహస్త మూని
    తిరిగెనందు నరేంద్రశేఖరులఁ గనుచు.

అట్లు తిరిగి తిరిగి పరికించి యయ్యంబుజాక్షి నక్షత్రకులంబున నక్షీణప్రభాక్షీణుండగు క్షపాకరుచందంబున నాక్షత్రకులకులంబున సమధికద్యుతివిద్యోతమానుండగు విక్రమాదిత్యుం గాంచి హృదయరాజీవంబు వికసింప నెల్ల రాజలోకంబు సూచుచుండఁ దనచేతనున్న పుష్పదామం బతని కంఠంబున వైచి నమస్కరించినది. అప్పుడు సభ్యు లెల్లరు జయ విక్రమార్కా? అని కరతాళములు వాయించిరి. మిత్ర నృపతు లభినందించిరి. ఆ మిత్రులు వినమితశిరస్కులై తమ నెలవులకుం బోయిరి. అంత మలయధ్వజుఁడును విక్రమార్కుని ప్రఖ్యాతి యంతకు మున్ను విని యున్న వాఁడగుట మిగుల నానందింపుచు నమ్మహారాజును సమిత్రముగా దోడ్కోనిబోయి యభూతపూర్వకములగు మహోత్సవములతో సమంత్రకముగా మలయవతి నతని కిచ్చి పాణిగ్రహణవిధి నిర్వర్తింప జేసెను.

ఆ శుభోత్సవక్రియలయందు మిత్రులు శత్రులు గూడఁ బరిచారకులవలె విపులముగా నుపచారములు గావించిరి మఱియు దీక్షావసానదివసంబు నాఁటిరాత్రి సమధికాలంకారభాసురంబగు శుద్ధాంతనిశాంతాంతరంబున విక్రమార్క సార్వభౌముండు మలయవతీ విలాసవతితోఁ గేళీలాలసములగు వచనములతో ముచ్చటించుచున్న యవసరంబున --

గీ. అరయ నిప్పటికేయ గృతార్థనైతి
    తీర్చుకొంటి నొకింత మదీయఋణము
    మలయవతితోడ నీఱేనిఁ గలిపి యహహ!
    కలిగె ననుకూలదాంపత్య కలన మిపుడు.

అని పలుకుచుఁ జేతులు జోడించి యెదుర నిలఁబడి నంత నమ్మహీ కాంతుండు వింతపడి చూచుచుండ మలయవతి యల్లన నిట్లనియె.

మనోహరా! ఈ తరుణీమణి యెవ్వతియో యెరుంగుదురా! మీరు జేసిన యుపకారము మరువక మీకుఁ దెలియకుండఁ బ్రత్యుపకారము జేయఁదలంచి మీ నిమిత్తమై భూమండలం బంతయుఁ దిరిగిన కృతజ్ఞురాలు, యక్షపత్ని యీమెయే. నన్ను మీ పాదసేవకురాలిగాఁ జేసిన ధన్యాత్మురా లీమెయే. ఈమెయే మదనమంజరి యని యా యువతి గావించిన పనులన్నియు నెఱింగించినది.

ఆ కథ విని యమ్మహారాజు అమ్మనేఁజెల్ల ? నన్ను స్వప్నవిభ్రాంతుం జేసిన యింద్రజాలపింఛికవు నీవా? అన్నన్నా? ఎట్టి మోహము గలుగఁ జేసితివి? మేలు మేలు. నీ ప్రజ్ఞావిశేష శక్తికి మెప్పు వచ్చినది. దేవీ! నా వలన నీకుఁ గాఁదగిన