పుట:కాశీమజిలీకథలు -09.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నిజమే యని యక్కలికి పలికినది. ఇది యేమి చోద్యమో నాకుఁ దెలియకున్నది. మలయవతి యను యువతి యున్నదని నీవు వింటివా? ఇంకను బెండ్లి కాకున్నచో దానిం బరిగ్రహింప వలసినదే? అందలి నిజానిజంబులం జారులం బంపి తెలిసికొన వలయునని యాజ్ఞాపించెను. అంతలోఁ దెల్లవారినది. విక్రమార్కుఁడు ఆస్థానము కరుదెంచి పీఠ మలంకరించెను. అప్పుడు పెక్కండ్రు భూపతుల వెంటబెట్టుకొని వచ్చి భట్టి వారి నుచితాసనాసీనులం గావించి వేఱు వేఱ వారి వారి యభిధానంబుల నా నృపాలున కెఱింగించుచు వారు దెచ్చిన కానుకల నందు రాశిగాఁ బోయించెను.

అప్పుడు విక్రమార్కుండు వారి నెల్లఁ జల్లని చూపులఁ జూచి యాదరించుచు వారి వారి నేస్తంబుల నభినందింపుచు నిట్లనియె. నృపతులారా! మీలో నెవ్వరైన మలయవతీనగర మెం దున్నదో యెఱుంగుదురా? మలయధ్వజుఁడనునృపాలుని పేరు వినియుంటిరా? అని యడిగిన వారిలోఁ గొందరు లేచి యిట్లనిరి.

దేవా! ఆ నగరము ద్వీపాంతరమం దున్నది మలయధ్వజుని కూఁతురు మలయవతి మిక్కిలి చక్కనిది. ఆమె స్వయంవరమునకు మే మాదీవికిఁ బోయితిమి. అం దెవ్వరిని వరించినదికాదు. ఆ చిన్నదాని కోరికలు కడు నసాధ్యములు. ఆమె కోరిన లక్షణములన్నియు దేవరయం దున్నవని చెప్పఁగలము. మలయధ్వఁజుఁడు చాల మంచివాఁడు. మే మెఱుంగుదుము. అని యా స్వయంవరవృత్తాంత మంతయుఁ జెప్పిరి.

అయ్యుదంతము విని యా నృపతి యపరిమితకౌతుకావేశముతో నప్పురంబున కరుగవలసిన తెఱవు దెఱంగంతయు దెలిసికొని యా ధారుణీపతులకుఁ బారితోషికము లిప్పించి వారి వారి దేశముల కనిపి భట్టితో నేకాంతముగా నిట్లు ముచ్చటించెను.

సుమతీ! నా కల తెఱగంతయు నీ కెఱింగించితిని గదా? ఇది స్వప్నమే యందువా? రెండవసారి చూచిన విషయంబులు నాకు స్వప్నములుగాఁ దోచుటలేదు. అది యింద్రజాలమువలె నున్నది. మలయవతి నా వృత్తాంతము తనకు మదనమంజరి యను యక్షకాంత జెప్పినదని నీవే నా భర్త వనియు స్వయంవరమున నన్ను బరిగ్రహింపు మనియు నుపదేశించుచు నది కలకాదు నిజమే యని నాకు నచ్చ చెప్పినది. నిజముగా నా మలయవతి నన్ను వరించునందురా? నీకేమి తోచుచున్నది. అని యడిగిన నవ్వుచు భట్టి యిట్లనియె.

మహారాజా! కొన్ని స్వప్నములు సత్యార్థమును సూచించును. తరుచు తనకుఁ బరిచయము గలవారితో ముచ్చటించినట్లు వచ్చుచుండును. ఎఱుంగనివారిం జూచినట్లు సంభాషించినట్లు కలవచ్చును గాని యథార్థమగుట వింతగానున్నది కానిమ్ము. దీని విషయమై నీ కింత చింతయేల? మలయవతి మిక్కిలి చక్కనిదైన నగుంగాక. దేవకాంతల కన్న నధికరాలాయేమి? వేలుపుల జవరాండ్రని ననుమతింపని నీ వా పొలఁతికై వలవంత గాంతు విది వింతగా నున్నది. నీవభిలషించిన నా