పుట:కాశీమజిలీకథలు -09.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    జాగుచేసినఁ గల యదృశ్యత వహించు
    రమ్ము కెమ్మోవి రుచిఁజూడ నిమ్ము సరగ.

అనుటయు నా కుటిలకుంతల యది కల గాదని తెలిసికొని మోహవివశ యయ్యు నప్రమత్తవలె మనోహరా? మ్రుచ్చువలె వచ్చి నాడెందము మ్రుచ్చిలించుచుంటి వట్లు చేయుటకు నేను వేశ్య ననుకొంటివా ?

గీ. పేరు సెప్పి కులము పెద్దల వివరించి
    గుణవిశేషములను గణుతిఁ జేసి
    చెంత కరుగవలయు నంతియకాక వే
    గిరము వడుట కాట తెరవనొక్కొ,

అనుటయు నమ్మహారాజు సముద్దీపితంబగు వ్యామోహంబున,

క. ఉజ్జయినీ రాజ్యపతిన్
   మజ్జనకుండల మహేంద్ర మార్తాండుఁడు భూ
   భృజ్ఞాత మెల్లగెలిచి భ
   వజ్ఞితమతి నైతి స్వప్నవశమునఁ దరుణీ!

నాపేరు విక్రమాదిత్యుఁ డందురు. భవదీయకులశీలనామాదు లెఱింగించి మచ్చోత్రానందము గావింపరాదే యని పలికిన విని యక్కలికి కులుకుచు లేచి నమస్కరించి మహారాజా! ఈ పీఠ మలంకరింపుము. యుష్మత్సాహసవితరణాదిసుగుణగణంబు లిదివఱకు మదనమంజరి యను యక్షకాంతవలన వినియుంటిని. భవద్దర్శనంబునఁ గృతార్థురాలనైతినని స్తుతియింపుచు మహాత్మా! మూడువేల యోజనముల దూరములో నున్న మీ నగరమునుండి యీ యర్దరాత్రమున నిక్కడి కెట్లు వచ్చితిరో యెఱింగింపుఁడు . తరువాత నా వృత్తాంతము జెప్పెదనని యడిగిన నతం డిట్లనియె.

విక్ర - తరుణీ ? ఇది నిక్క మనుకొనుచుంటివా ఏమి ? కాదు. స్వప్నము.

మల - మహారాజా ! మన మిట్లు మాట్లాడికొనుచుండ స్వప్న మెట్లగును?

విక్ర - ఇదివఱ కొకసారి యిట్టి స్వప్నము వచ్చినది. జ్ఞాపకమున్నదా? ఇదియు నట్టిదే?

మల - ఓహో! నిజముగా మీరు వచ్చితి రనుకొనుచున్నాను. ఇది స్వప్నమా?

విక్ర - స్వప్నమే. ఈ సుఖము క్షణభంగురము. ఏ వైతాళికుఁడో లేపగలఁడు. నిద్రాభంగమైన నేమి జేయగలము?

మల - మన కన్నులు తెరవఁబడియున్నవే. దీని స్వప్నమందురేమి?