పుట:కాశీమజిలీకథలు -09.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

చెలికాఁడు దాపునఁ గూర్చుండి యిట్లు సంభాషించుచుండెను. దేవా! నీవు విజయయాత్రకు వెడలి నానా దేశంబులుం దిరిగి వచ్చితి వందు -

సీ. సౌవీరభూనేత శరణుజొచ్చినఁగాచి
          తంగేశుచేఁ గప్ప మందికొంటి
    పాంచాలబతి బాహుబల దర్పముడిపితి
          చోళభూపతిఁ బారఁ దోలినావు
    యపవావనీసఁ బాదాక్రాంతుఁ జేసితి
          టెంకణేశ్వరునిఁ గట్టించినావు
    నేపాళభూపాలు నేపడంచితివి బ
         ర్భరనాయకునిఁ బట్టి పరిభవించి
గీ. తెల్ల భూమీధవులను జయించి పిదప
    మంచి మాటలచే నూరడించి వారి
    వారిదేశము లిప్పించి పంపి తహహ!
    నీగ్రహానుగ్రహాత్యంత నీధి మెరయ.

మహారాజా ! భవదీయ దాక్షిణ్యాభి రక్షితులగు క్షితిపతు లత్యంత విశ్వాసముతోఁ గానుకలం దీసికొని వచ్చి దర్శనార్థులై వేచి యున్నారు. నేఁటి యుదయము నుండియు నీ వెవ్వరితో మాట్లాడక చింతా పరాధీనమానసుండవై యున్నవాఁడవట. పరిజనులు నీ కడకు రావెఱచుచున్నారు. అందలి కారణం బేదియో వివరింపరానిదా అని యడిగిన శ్రీధరున కమ్మహీధవుం డిట్లనియె.

వయస్యా ! భట్టి విదేశాగతులగు భూపతుల సత్కరించుచున్నాఁడని విని నీ కొఱకు రెండువార్తల నంపితిని. అందలి కారణంబు వినుము. నిన్న నా కొక చిత్రమైన కల వచ్చినది. దానిం దలంచుకొనుచుండ నొండు తోఁచకున్నది. అట్టి వినోద మదివఱకు నే నెఱుంగను.

శ్రీధరా! నేను దేశాటనము జేయుచు సముద్రముఁ దాటి ద్వీపాంతరమున కరిగి యందొక విచిత్రమైన పట్టణముఁ జేరితిని. అన్నగరము సమున్నత ప్రాసాదముల చేతను విశాలమగు వీధులచేత మనోహరమై యొప్పుచున్నది. నే నాపుర విశేషముల జూచుచుఁ దిరుగుచుండ నొక దండ నేడంతరములు గల మణిసౌధము నాకుఁ గన్నులపండువఁ గావించినది. చొరవమై నేనందుఁ బ్రవేశించి యాదివ్య భవన విశేషములం జూచుచు వెఱఁగుపాటుతో నందొక దెస వెలయుచున్న స్పటిక సోపానముల నుండి పైయంతరమునకుఁ బోయితిని. అందెవ్వరును గనంబడలేదు. ఆ భవనము నాలుగు దెసలు పరికించి యందొకచో నున్న మెట్ల వెంబడి మఱియొక యంతరమెక్కితిని. అందును జనులు లేరు.

జనశూన్యమైన యారంతరములు బరిశీలించి చూచి చూచి యాశ్చర్యముతో