పుట:కాశీమజిలీకథలు -09.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నాగపురంబున కరిగి తన బుద్ధిబలంబున నన్నగరాధీశ్వరునిఁ దనకు శిష్యునిగాఁ జేసికొని యా దేవాలయమును నేలమట్టము గావింపఁజేసెను. వెంటనే కళావతి పూర్వరూపము వహించి వానిం జేరినది. టింటాకరాళుండును బుడమిఁ బెద్దకాల మా ముద్దుగుమ్మతో సుఖించెను.

అగ్నిశిఖా? టింటాకరాళుం డెటువంటి యుక్తిలంపటుండో వింటివా ? ఢాకినేయుఁడు నిన్నీనూతఁ ద్రోయుట యేమిచిత్రము. అని బ్రహ్మరాక్షసులు నాతో ముచ్చటించిరి. కానిండు. నేటిఁతో నయ్యెనా ? నేను రేపు బోయి వానిపని పట్ట కుందునా? అని పలుకుచు మరునాఁ డానూయి బయలువెడలి నే నీ యూరంతయు వెదకి యొకపొలిమేరలో వానిం బట్టుకొని నాబలప్రభావములు లాగెకొని వానిం గడ తేర్చుటకుఁ బ్రయత్నించుచుండ నీ మహారాజు దైవికముగా గుఱ్ఱమెక్కి యా దారిం బోవుచుండెను.

వాఁ డాభూపతిం జూచి మొఱ్ఱోయని యరచుచు మహాప్రభూ! నన్నీ భేతాళుఁడు జంపుచున్నాఁడు. రక్షింపుమని ప్రార్థించెను. ఎవఁడవురా నీవని యాఱేఁ డొక్క కేక పెట్టినంత నేను వానిని విడిచి కాలికొలఁది. పారఁదొడగితిని. అప్పుడు తన గుఱ్ఱమును నా వెంటఁ బరుగెత్తించి యరనిమిషములో నామడములుద్రొక్కి కరవాలాగ్రంబు నా శిరంబున గ్రుచ్చినిలఁబెట్టి తర్జించుటయు నేను గదలలేక యమ్మహారాజు పాదంబుల బట్టకొని దేవా? ఇది మొదలు నీకు నేను దాసుండనై నీవు తలంచినప్పుడు వచ్చి నీవు చెప్పిన పనులఁ గావింపుచుండెద నన్ను విడువుమని ప్రార్థించితిని.

ఆ దయాళుండు కానిమ్ము . నీ విటుపైన మనుష్యుల జోలికి రాఁగూడదు. వచ్చితివేని నన్నెఱుంగుదువా ? జాగ్రత్త. పొమ్మని వదలివేసెను. యమశిఖా? విక్రమార్కుండన నెవ్వఁడో యిప్పుడైన దెలిసినదా? మన చక్రవర్తియగు మహాభేతాళుం డతనికి దాసుండని యెఱుంగుదువా? నా యాహారమును విడిచి పొమ్ము. అమ్మనుజపతి యెఱింగిన నీపీచ మడంచునని పలికిన పండ్లికిలించుచు యమశిఖుం డిట్లనియె.

అగ్నిశిఖా? మనమిద్దరము నొక్క బడిలోనే చదివికొంటిమి. నీబిభీషికలకు నేను వెఱచువాఁడనా పో. పొమ్ము. నావశమైన యీ భక్ష్యము నీకీయనని గద్దించి పలికెను. అప్పుడా శవమునకై యా భేతాళు లిద్దరు మఱల గ్రుద్దులాడఁ దొడంగిరి.

అప్పుడు విక్రమార్కుఁ డవ్విధ మెఱింగి తన చేతనున్న కత్తికొనచే నేల నా యమశిఖుని విగ్రహము గీసి తదవయవములు ఖండించెను. యమశీఖుఁ డా శవమును విడిచి కాలుచేతులు దెగి నేలంబడి యేడ్చుచుండ నగ్నిశిఖుండు వాని సందిటం బట్టికొని యెత్తి దూరముగా బారవైచి యా ఖండపాలికుని శవమును భక్షించి తదామంత్రణంబు వడసి యదృశ్యుండై పోయెను.

రాజపుత్రీ! ఆ చిత్ర మంతయు నేను గన్నులారఁ జూచితిని. చెవులార .