పుట:కాశీమజిలీకథలు -09.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మేము మీతోఁ జూదమాడఁ జాలము. ఓడితిమని ప్రత్యుత్తర మిచ్చుచుండునవి. దానం జేసి వాఁడు వారి నేమియుం జేయలేకపోయెను.

మఱియొకనాఁడు రాత్రి వా డేమియుం దోచక విచారించుచుఁ గోవెల కవాట వివరములనుండి మహాకాళనాథుని దర్శనము జేసి -

క. కాళీ ప్రాణేశ! మహా
   కాళా! నీనేర్పు జాతుఁగద నాతో నీ
   వేశ నిఁట జూద మాడఁగ
   రా? లే లెమ్ముడుమీ ? వరాలెన్నైనన్ .

అని పిలుచుటయు -

సీ. టింటాకరాళ నీవంటి జూదరివాఁడు
               మూఁడులోకంబుల లేఁడు చూడ
    నీతోడ నాడంగ నేర్పు నాకును లేదు
               నే నోడిపోయితి నీకు నేఁడు
    పలుమారు నీవిట్లు పిలువనోడితిమన్న
               జనులచే మాకుఁ బూజ్యత నశించు
    బ్రతిమాలికొంటి నీపై వేలుపుల జోలి
               కిని రాకు నీకుఁజాలిన కితపుని
గీ. తోడనాడుమటంచు మృత్యుంజయుండు
    బలికె నసమర్థులట్ల వేల్పులును పాప
    భయవిసర్జితులైన దుష్పధుల కెపుడు
    వెఱచుచుందు రుపేక్షభావించి మదుల.

టింటాకరుళుం డట్లు దేవతలచే వంచింపబడి యాత్మగతంబున నిట్లు తలంచె నాహా? కందమూలాదుల భక్షింపుచు దారుణారణ్యమధ్యంబులఁ దపంబుజేయు మహర్షులతో నైన సంభాషించుకొని యీ దేవతలు దురోదరవ్యాపారరతుండనగు నాకు వెఱచి నీతో జూదమాడలేమని పలికిరి. ఇంతకన్న వింత యేమున్నది? భక్తకల్పద్రుమంజగు మహాకాళనాథుండు నీతో నాడలేను నాజోలికిరాకు. అని నన్నుఁ బ్రతిమాలికొనుట మత్పురాకృతసుకృతముగాక వేఱొకటి కలదా ? అమ్మహాత్మునే శరణంబు నొందెద నెట్లు రక్షింపఁడో చూచెదంగాక యని తలంచి స్వామికి సాష్టాంగనమస్కారములు గావించుచు నిట్లు వినుతించెను.

గీ. మేదినీధరకన్యతో జూదమాడి
    యుడపవృషభేభ చర్మము లోడిపోయి
    జానువిన్యస్త గండుండవైన నీదు
    విమల నగ్నాంగకంబాత్మ వినుతిఁజేతు.