పుట:కాశీమజిలీకథలు -09.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

రేమి దీసికొనఁగలరు. కావలసిన నా కిచ్చు నూఱుగవ్వలు మీఁదఁ బారవైచెదనని యాలోచించి యా జూదరి వారి కిట్లనియె.

ఓ మాతృగణములారా? మిమ్ము నేఁడు నాతో జూదమాడఁబిలుచుచున్నాఁడను. ఓడినవారు గెలిచినవారికి నూరు బంగారుమాడ లిచ్చుకొనవలయును. ఇదియే ఫణము. సమ్మతించితిరా. ఇద్దరియాట నేనే యాడెదను. చూడుఁ డిదిగొ పాచికలు వేయుచున్నాను. ఇది నా యాట. ఇది మీ యాట. నా యాట గెలచినది. చూడుఁడు మీ రోడిపోయితిరి. నా కీయవలసినమాడ లీయుఁడు. అమ్మలారా! తీసుకొని రండు. ఈయకున్న నేను విడుచువాఁడనుకాను. జూదరులకు దయా దాక్షిణ్యము లుండవు. అని పెద్దకడవు విగ్రహముల కడకుఁబోయి యడిగెను.

రాతి విగ్రహములు మాటాడునా? ఎంత సేపఱచినను బ్రతివచనము వినంబడలేదు. అప్పుడు వాఁడు లేచి కోపముతో మాతృగణములారా? మీరు నా ప్రజ్ఞ యెఱుంగరు మౌనము వహించియున్న విడుతునని తలంచుచుండిరికాఁబోలు సొమ్ము తీసికొనువఱకు వదలను. ఇదిగో మీరిఁక మాటాడకున్న రంపములతో మీ యవయవంబులం గోసి పారవేసెద. హాయిగా నిందుండి సుఖింపుచున్నారు. ఆ సుఖమేల పాడుచేసికొందురు అని పలుకుచు రంపము దెచ్చుటకు వెళ్ళఁబోవు నంతలో ఆ! నిలు. నిలు. గడియతాళుము. నీ సొమ్మిచ్చి వేయుదుము అని యాకాశవచనముగాఁ బలికి యెక్కడికో పోయి వాని కీయవలసిన బంగారము దెచ్చి యిచ్చివేసిరి.

ఆ సొమ్మందుకొని వాఁడు తాను వైచిన పాచిక పడినదిగదా యని సంతసించుచు మఱునాఁడుగూడ వారిం జూదమునకుఁ బిలిచి యాడి యోడించి సొమ్మిమ్మని నిర్భంధించుటయు నా దేవత లేమియుం జేయలేక యెక్కడికో పోయి బంగారము దెచ్చి యిచ్చుచుండిరి. ఇట్లు ప్రతిదినము వాఁడు జూదమాడి యోడించుచు మాతృగణమువలనఁ జాల బంగారము సంపాదించెను.

ఇట్లు కొన్నిదినములు జరిగినంత నొకనాఁడు చాముండ యను శక్తి యా మాతృగణమును బరామర్శింప నచ్చటికి వచ్చినది. అందున్న మాతృశక్తులన్నియు విచారముతో నుండుటం జూచి అక్కలారా? మీరిట్లు దుఃఖభాజనులై యుంటిరేల? మహాకాళినాథుని యాలయములో వసించియుఁ జింతించుటకు హేతువేమి వచ్చినది? అని యడిగిన నా దేవత లిట్లనిరి.

అక్కా! మా యిక్కట్టు నీతో నేమని వక్కాణింతుము. ఒక్క జూదరి మా పని పట్టుచున్నాఁడు. పిలువని బేరంటకముగా మీతో జూదమాడితి. మీ రోడితిరని చెప్పి యోడిన మాడల నిమ్మని నిర్బంధించుచున్నాఁడు అలకాపురంబున మా కొక పరిచితురా లున్నది. నిత్యము నామె యొద్దకుఁ బోయి వేడికొని వీని కీయవలసిన బంగారము దెచ్చి యిచ్చుచుంటిమి. ఎంత పరిచయమున్నను నిత్య మడుగుటకు మొగమాటముగాదా? వీఁడు నిత్యము మ మ్మదేపనిగా వేపుచున్నాఁడు. ఈ యాపదఁ