పుట:కాశీమజిలీకథలు -09.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టింటాకరాళుని కథ

221

బ్రహ్మరాక్షసులారా! నేను మీ కథ నెరుంగుదును. నే నగ్నిశిఖుం డను భేతాళుండ. డాకినేయుఁడు మీ నిమిత్తమై నా బలప్రభావము లెరవు దీసికొనిపోయి మీ కేడుదినము లాహారము నర్పించెను. నేఁడేమియు నాహార పదార్ధము దొరకలేదని పరితపించుచు నన్నీ నూతి యొద్దకుఁ దీసికొని వచ్చి తొంగి చూచుచుండ గాళ్లెత్తి నన్నిందులోఁ బడవేసెఁ గృతఘ్నుఁ డెట్టిపనిజేసెనో చూచితిరా? బలవంతుఁడఁగావున సరిపోయినది. లేకున్న మీకాహారము కావలసినదేనా? అని నా వృత్తాంతమంతయుం జెప్పితిని.

బ్రహ్మరాక్షసులు అమ్మ డాకినియా? యెంత పని జేసితివిరా? అనివెఱఁ గందుచు నౌను జూదరులకుఁ గల యూహపోహ లెవ్వరికిం గలుగవు. కితవుల నెన్నఁడును నమ్మఁగూడదు. టింటాకరాళుండను జూదరి యింతకన్నను టక్కిరి. వానిచరిత్ర వినిన నీవు మఱియు వెఱఁగందఁ గలవు వినుమని యక్కథ నిట్లుచెప్పఁ దొడంగిరి

టింటాకరాళుని కథ

తొలి టింటాకరాళుం డను జూదరి యీ యుజ్జయినీపురంబున వసించెను. ద్యూతక్రీడలలో నా కాలమున వాని నోడించినవాఁడు పుడమిలో లేకపోయెను. అభినవశకుని యని వానికి బిరుద మొసంగిరి. ఒకనాఁ డీవీటి జూదరు లందఱు గుమిగూడి జూదములో వాఁడెవ్వరి పక్షము జేరక తటస్థుఁడుగా నుండుటకును నిత్యము వానికి నా యూరనున్న కితవులు నూరుపర్దిక లిచ్చుకొనునటుల నియమము జేసి వాని నొప్పించి యట్లర్పించుచుండిరి. వాఁడు ప్రాయమునఁ బిన్నవాఁడు రూపమునఁ జెప్పదగినవాఁడు యుక్తిప్రయుక్తులలో మిగుల నేర్పరి అట్టివాఁడైనను వాఁడు జూదరి యగుట నెవ్వరుఁ బిల్ల నిచ్చిరికారు. భార్యాపుత్రబంధు శూన్యుండగు టింటాకరాళుండు నిత్యము తనకు జూదరు లిచ్చు నూఱుగవ్వలు పెట్టి గోధుమచూర్ణము కొని తడిపి ముద్దగాఁ జేసి మర్దించి యప్పములుగా జేసి సాయంకాలమున శ్మశానమునకు నడచు చితాం గారముల నా యప్పముల గాచి రాత్రి మహాకాలునియాలయమునకు వచ్చి దీపము చమురులో ముంచి యాయపూపముల భక్షించి యాకలి యడంచుకొనుచుండును. మఱియు నక్కోవెల ముఖమండపము నందె పండుకొని నిద్రఁబోవును.

ఇట్లు కొంతకాలము జరిగినది. ఒకనాఁడు రాత్రి యాదేవళములోఁ బండికొని వాఁడిట్లు ధ్యానించెను. అయ్యో? నాకు జూదములో నెంత నైపుణ్యమున్న నేమి? నా కర్మము నాతో నెవ్వరు జూదమాడరు. దాపునకైన రానీయరు. నూరు గవ్వలు నా మొగానఁ బారవేయుదురు. దాన వచ్చు పిండివలన నాకుఁ గడుపు నిండదు. ఏమి జేయుదును. నా కెన్నేని యూహలు గలవు. నా కడుపుననే జీర్ణమగుచున్నవి. కానిమ్ము ఈ యాలయకుడ్య భాగముల దేవతాస్త్రీవిగ్రహములు సుందరముగా నమరింపఁబడియున్నవి. ఈ మాతృదేవతల జూదమునకు బిలిచి యాడి యోడించెద. వీ రెక్కడనైన నోడిన విత్తము దెచ్చి యియ్యగలరు నేనే యోడితినా నా యొద్ద వీ