పుట:కాశీమజిలీకథలు -09.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

బోయి యా మాంసమేమి వెలకిత్తువని యడిగితిని. వాఁడు నన్నుఁ బరీక్షించి చూచి మీ రూపబల ప్రభావముల నా కొకసారి యెఱువిత్తురేని యీ మాంసము మీ కిత్తునని చెప్పితిని.

నా రూప ప్రభావములతో నీకేమి ప్రయోజనము. వానిం బుచ్చుకొనియేమి చేయుదువు ? తిరుగా నెన్నిదినముల కిత్తువని యడిగితిని. అతండు తన కథ యంతయుం జెప్పి నన్ను వంచించిన జూదరులం బట్టికొని బలవంతముగ నా నూతిలోఁబడవేసి యా బ్రహ్మరాక్షసుల కాహారము గావించెద నెనిమిదవనాఁడు మీ రూప ప్రభావములు మీ కిచ్చి వేసెదనని చెప్పి నన్ను నమ్మించెను.

నే నప్పుడు నా రూప ప్రభావములు వానికిచ్చి యా మాంసము పుచ్చుకొంటిని. వాఁడు మిగుల సంతసించుచు నప్పు డాగ్రామము లోనికిఁ బోయి తన్ను మున్ను వంచించిన జూదరుల నేడ్వురం బట్టికొని కట్టిపెట్టి దినమున కొక్కొక్కని వంతున నా నూతిలోఁ బడవేసి యా భూతముల కాహారము సమర్పించెను.

ఎనిమిదవనాఁ డందు బడవేయుట కేమియు నాహార వస్తువానికి దొరకనది కాదు. వాడు విచారించుచు మఱల నా శ్మశాన భూమి కరుదెంచెను నేను వానింజూచి ఢాకినియా ? నీ పని తీనదియా ? నా స్వరూప ప్రభావములు నాకిఁక నిత్తువా ? అని యడిగితిని. వాఁడు దీనవదనుండై మహాత్మా ! నీ యనుగ్రహమున నేఁడుదివసములు గడిపితిని. నేఁ డేమియుఁ గనంబడకున్నది. నేఁ డేమియు లేకున్న రేపు వాండ్రుపైకి వచ్చి ముందుగా నా పని పట్టుదురు. ఏమి చేయుటకుం దోచకున్నది. అని విచారింపు చుండ నేమేయీ? | ఆ నూయి యెంతదూర మున్నది ? నాకుఁ జూపెదవా ? ఆబ్రహ్మ రాక్షసులం జూచెద ననవుఁడు రమ్ము రమ్ము. దాపుగనే యున్నదని పలుకుచు నన్నా కూపసమీపమునకుఁ దీసికొనిపోయెను.

బహుతృణకంటక లతావృతమై భూసమకుడ్యమై యంధకార బంధురంబై యగాథమై సర్పభేకకచ్ఛపాజగర భయంకరమై యొప్పు నప్పాడు నూతికడకుఁ బోయి లోపలకు వంగి తొంగి చూచుచుంటిని.

అప్పు డాకృతఘ్నుఁడు నారెండు కాళ్ళుపట్టుకొని యెత్తి గుభాలున నన్నా కూపములోఁ బడవేసెను. అందున్న బ్రహ్మరాక్షసులు నన్ను భక్ష్యమనుకొని పట్టికొని నా యొడల ముక్కలుగా నిరువఁబోయిరి.

నేను వారికి లొంగక కరపద ప్రహారంబులఁ బీడ గలుగఁ జేసితిని. అందు నాకును వారికినిఁ బెద్ద ముష్టియుద్ధము జరిగినది. అందు నాకే జయము గలిగినది. మదీయ పరాక్రమమునకు లొంగి వాండ్రు బాబూ ? నీ వెవ్వడవు? ఆ డాకినేయుఁడు మా పని పట్టుటకు నిన్నిందుఁ బడవేసెనా యేమి ? నీవు మనుష్యుఁడవు కావు. నీ పరాక్రమము స్తోత్రపాత్రయై యున్నది. నీతో మైత్రిం జేయఁ దలంచితిమి. నీ వృత్తాంతము జెప్పుమని యడిగిన నేనిట్లంటిని.