పుట:కాశీమజిలీకథలు -09.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నాభర్త బ్రహ్మవాక్యముఁ దలంచి యుజ్జయినీపురంబున కరిగి విక్రమార్కుని హజారమున నిలువంబడి పెద్దయెలుంగున నోమహారాజా విక్రమాదిత్యా? ఆదిత్యసమతేజా! మీ రాజ్యములో నొక కాపాలికాధముఁడు మహాపతివ్రత యక్షకాంతం జెరఁబట్టు చున్నాఁడు. వేగవచ్చి రక్షింపవే? దీనశరణ్యా? అని వేడికొనియెను.

ఆపరిదేవనము చారులవలన విని యమ్మహాత్ముఁడు ఖడ్గహస్తుఁడై వెఱవకుఁడు వెఱవకుఁడు నేనిదే వచ్చుచున్నాఁడనని పలుకుచు నాభర్తయొద్దకు వచ్చి యయ్యుపద్రవము విని యతివేగముగా నా స్మశానభూమికిఁ బరుగెత్తుకొని వచ్చెను.

అట్లు నన్నాభైరవుండు లాగికొనిపోయి యా పితృవనములో మండుచున్న చితిపై నొప్పు శవముపై గూర్చుండి హోమము జేయుచున్న కాపాలికుని నతం డంతర్హితుం డయ్యెను. వాఁడు నన్నుఁ జూచి కొమ్మా? రమ్ము, రమ్ము. నిన్నిట్టా రప్పించితినని కోపింపకుము. ఇప్పుడైన నాశక్తి తెలిసినదియా? నీ యథరామృత మిచ్చి కాపాడుమని పలుకుచు జితి దిగి నాచెంతకు వచ్చుచుండెను. అప్పుడు నేను భయాక్రాంతస్వాంతనై హా! విక్రమార్క మహారాజా! హా! దయానిధీ! ఆర్తరక్షకా! అని మొఱ పెట్టునంతలో -

ఉ. ఎవఁడవురా దురాత్ముఁడ ? మదీయపురాంతికమందె యిట్లు మం
    త్రనిధి మహాపతివ్రత నధర్మరతిం జెరపం దలంచు చుం
    టివి? భవదీయ మస్తము పఠేళ్ళున వ్రక్కలుజేసి నీదు భై
    రవునకె భోజనం బిడుదురా నిలు మిప్పుడె చూడు దుర్మతీ ?

అని పలుకుచు నలుదెసలం బరికించి యోరీ? అగ్నిశిఖా? ఇటురా అని పిలుచునంతఁ గన్నులు నిప్పులు గ్రక్కుచు నరుణజటాకలాపము వ్రేలాడ హుంకారము గావింపుచు నోరుఁ దెఱచికొని యా భేతాళుం డరుదెంచి చేతులు జోడించి మహాత్మా? సెలవేమి? అని యడుగుటయు నమ్మహారాజు పరదారాపహర్తయగు నీ కాపాలికాముని శీఘ్రము వధింపుమని యాజ్ఞాపించెను.

అప్పు డయ్యగ్నిముఖుండు హుమ్మని మొగంబు దెఱచికొని కాపాలికుని మీఁది కురికినంత వాఁడు వెఱచి చితియురికి వెనుకముందు జూడక కాలికొలఁది పారఁ దొడంగెను. అగ్నిశిఖుండు వానివెంటఁబడి తరిమి వాని రెండు కాళ్లునుం బట్టికొని గిర గిర ద్రిప్పి నేలంగొట్టుటయు ముఖనాసావివరములనుండి రక్తంబుగార నాపాపాత్ముండు గిలగిలఁ దన్నికొనుచుఁ బ్రాణములు విడచెను.

ఆ స్మశానములోఁ దిరుగుచున్న యమశిఖుండను మఱి యొక్క భేతాళుం డాకాపాలికుని శరీరములో దూరి గంతులు వైచుచు నగ్నిశిఖునిపై నెదుర్కొని పోట్లాడుటకు డీకొనియెను. ఇరువురకుఁ గొంత సేపు ముష్టియుద్ధము జరిగినది. అగ్నిశిఖుండు యమశిఖునితోఁ బోరుచు ఓరీ? దుష్టుఁడ తొలఁగుము. నేను మహానుభావుండను విక్రమార్కచక్రవర్తిగారి యాజ్ఞానుసారమున నీకాపాలికుఁ బరిమార్చితిని. నీవెవ్వఁడవు ?