పుట:కాశీమజిలీకథలు -09.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

భైరవునిచే నాయున్న నెలవున కీడ్పించి తెప్పించుకొందుఁ జూడుమని పలుకుచు నప్పుడే యావీటి వల్లకాటికిఁబోయి యం దొకచో నగ్ని వ్రేల్చి మదీయ నామంబుచ్చరింపుచు వశ్యమంత్రములచే భైరవునిగుఱించి హోమముఁ జేయుచుండెను.

నే నావిధ మంతయుఁ దెలిసికొని నా భర్త వచ్చిన తరవాత జరిగిన కథ జెప్పి యా కాపాలికుఁడు చేయు క్రియకుఁ బ్రతిక్రియఁ గావింపవలయునని ప్రార్థించితిని. అప్పు డాయన మిక్కిలి పరితపించుచు నన్ను వెంటఁ బెట్టుకొని తన యన్న యగు కుబేరునొద్దకుఁ బోయి యిట్లనియె.

క. అన్నా? మే ముజ్జయినిం
   జెన్నగు పూతోఁటలో వసించి చరింపం
   గన్నాఁ డొక కాపాలికుఁ
   డెన్నిక నీమరదలను సుఖేచ్చఁ దలిర్పన్.

ఈమెచే నిరాకరింపబడి మంత్రబద్దంజేసి రప్పించుకొను తలంపుతో హోమముఁ జేయుచున్నాఁడు. ఈ యుపద్రవముఁ దప్పింపుమని కోరిన విని కుబేరుండు,

సీ. సురలోకములకన్న ధరణీతలంబు సుం
            దరమైనదంచునం దరిగినారొ ?
    మనచైత్రరథముకన్నను శోభనొప్పారు
            మకరంద మనియందు మసలినారొ ?
    కాపాలికులు కడుంగడు నుత్తములటంచు
            వారుండు తావులఁ జేరి నారొ ?
    దుర్మార్గులకు నెప్డు దూరస్తులై యుంట
            మంచిదౌ ననుమాట మరచినారొ ?
గీ. యేమిటికిఁ బోతిరో ? మీర లిలకు నటకు
    అకట? కాపాలికాధముం డొకఁడు యక్ష
    కులవధూమణి నిజమంత్రబలములన
    లాగికొనినపోవ నెంచుట బాగు! బాగు!

అని మమ్ము మదలించుచు నందులకుఁ బ్రతిమంత్రవేత్త యెవ్వడని యాలోచించియు నేమియుం దోచక మమ్ము వెంటఁబెట్టికొని యప్పుడ స్వర్గలోమునకు నిర్గమించి మహేంద్రునికి మమ్ముఁజూపుచు జరిగినకథ యంతయుం జెప్పి వీరి యాపదఁ దప్పింపుమని ప్రార్థించెను .

శచీపతి బృహస్పతిని రప్పించి కార్యమెఱింగించి యందలకుఁ బ్రతిక్రియ యెట్లని యడిగిన నతండు విమర్శించి,