పుట:కాశీమజిలీకథలు -09.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనమంజరి కథ

213

నలంకరించుకొని పీఠములు సవరింపఁజేసి యాసరసిజాననరాక కెదురు సూచుచుండఁ బరిచారికవెంట నా కలువగంటి వచ్చినది. పదియడుగు లెదురువోయినది. పన్నీటఁ బదములఁ గడిగి శిరంబునఁ జల్లుకొన్నది తడి యొత్తి హారతు లిచ్చి రత్నపీఠంబునం గూర్చుండఁబెట్టి సఖులచే వింజామరల విసరింపుచు వినయముతోఁ చేతులు జోడించి యిట్లనియె.

దేవీ! నీ వృత్తాంతము నా పరిచారికవలనం దెలిసికొంటి. నీయకారణవాత్సల్యమునకు మిక్కిలి యానందించితిని. నా నోములు ఫలించినని మానుషదుర్లభమైన మీ దర్శనముఁ జేసి కృతార్థురాలనై తినని పెద్దగా బొగడి అమ్మా! నీవెందుండి యెందుఁ బోవుచు నిందు వచ్చితివి. నీకు మంగళంబేకద? అని యడిగిన మదనమంజరి యాదరించుచు నిట్లనియె.

రాజపుత్రీ! నా చరిత్ర మించుకఁ జెప్పెద నాకర్ణింపుము. మా కాపుర మలకాపురము. నా భర్త కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుఁడనువాఁడు. మా తండ్రి దుందుభి. నా పేరు మదనమంజరి యండ్రు. నేను నా భర్తతోఁ గూడికొని మూఁడు లోకములు తిరుగుచుందును. భూలోకములో నుజ్జయిని యను నగరముగలదు. దాని సర్వసంపదలకు నాకరముగా విశ్వకర్మ నిర్మించెను. ఆ నగర ప్రాంతమందు మకరందమను నుద్యానవనము గలదు. అత్తోఁట నందనచైత్ర రథాదుల మించి యున్నది.

ఒకనాఁడు. మే మాయుపవన ప్రాంతమునుండి పోవుచు నందలి వింతలు సంతసముఁజేయ నాయారామమునకుఁబోయి మనోహరునితోగూడఁ గొన్నిదినము లందు విహరించితిని. అందలి ఫలపుష్పలతా విశేషములు మమ్మందుండి కదల నిచ్చినవి కావు. ఒకనాఁడు ప్రాతఃకాలమున నే నందు బాలాతపము సేవింపుచుండ

క. శూల మొకకేలఁ దనరఁ గ
   పాలం బొకకేలఁ గ్రాల భయదాకృతి నా
   మ్రోల న్నిలువంబడెఁ గా
   పాలికుఁ డొకఁ డురుజటావిభసితాంగుడై .

న న్నెగాదిగ చూడచుండ గుండెబెదరి బెదరుదోప నీవెవ్వఁడ విం దేల వచ్చితివని యడిగతిని. వాఁడు చేడియా ! నీ చక్కఁదనము నా హృదయమును వ్రక్కలు చేసినది నీ యధరామృతం బొకసారి ద్రావనిత్తువేని నా సంతాపము చల్లారునని పలికిన నలుకతో నే నోరీ? తులువా? నిలు నిలు. మా మగవా రిప్పుడే వత్తురు. నేనొంటిదాననని యవాచ్యము లాడుచుంటివి. పో. పొమ్ము. పోకున్న నీ మదము నదమము చేయఁగలరని తిట్టితిని.

వాఁడు వేడిచూపుల నన్నుఁ జూచుచు నోసి? నీ జవ్వనము క్రొవ్వున నొవ్వ నాడితివి. నే నెవ్వఁడనో యెఱుంగుదువుగాక. నిన్ను మంత్రబద్ధం జేసి