పుట:కాశీమజిలీకథలు -09.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నే గనుఁగొంటిని. ఆమె చక్కదనము నీవు జూచిన మిగుల మెచ్చుకొందువు. మా యిరువురకు మాటలు గలిసినవి. ప్రస్తావములో నీ రూపము నీ విద్య నీ గుణములు నీ యభిలాషల తెఱం గెఱింగించితిని. నీకుఁ దగిన వరుండెందో యున్నవాఁడని చెప్పుచు నిన్నుఁజూడ నిందు వత్తునన్నది. కాని సెలవులేక తీసికొని వచ్చిన నేమందువో యని యందే యుంచి వచ్చితినని చెప్పినంత నా కాంత కంటకంబడి యిట్లనియె.

గీ. సకల జగదీశుఁడగు మహేశ్వరుని సఖుఁడు
   ధనదుఁ డుత్తముఁ డతని సోదరునిపత్ని
   నన్నుఁ జూడగవచ్చెనన్న వలద
   టందువే ఆజ్ఞకొఱకు మర్యాద యగునె?

కుబేరుఁడన సామాన్యు డనుకొంటివా? మన యైశ్వర్యమంతయు వారి గోటి కొనతోఁ బోలఁజాలదు. వారు వేల్పులు. పూజనీయులు. తదాగమనం బనుగ్రహంబుగాఁ దలంపక యాడపెట్టి వచ్చితివా ? చాలు చాలు. వేగఁబోయి యపరాధము జెప్పికొని ప్రార్థించి తీసికొనిరమ్మని యప్పనికత్తె ననిపినది.

మదనమంజరియు నా ప్రాంతమందుఁ దిరోహితయై నిలువంబడి వారి మాటలన్నియు నాలించుచు నయ్యిందువదన సౌందర్యాతిశయ మాపాదమస్తకముగా విమర్శింపుచు -

ఉ. మేలు! బలే? సెబాసు! పరమేష్టి విశిష్టత విక్రమార్కభూ
    పాలు నిమిత్త మీకిసలపాణి సృజించె నిజంబ కానిచో
    బాలిక సర్వసద్గుణ విభాసురుని న్వరుఁ గోరి యెవ్వనిం
    బోల వరింపకున్నె తలపోయ స్వయంవరకార్యదీక్షలన్.

ఇన్ని దేశములు దిరిగినందులకు నేఁటికి నా పరిశ్రమ సఫలమైనది. ఈ కలువకంటి కలలోఁ గన్న చెల్వుం డాతండే కావచ్చును. చిత్రఫలకముఁ జూచిన నా కిప్పుడే తెలియగలదు. దైవమే నన్నిక్కడికిఁ దీసికొనివచ్చెను. ఉపశ్రుతివలె నాకీ శుభోదర్కము వినంబడినది. గాక వనమోహిని నా పుణ్యమూర్తికిం బెండ్లిజేసి కృతకృత్యనగుదు. ఈ భూతదీయ సౌందర్య చాతుర్య సాహస వితరణాదిగుణంబు లభివర్ణించెద నని తలంచుచు యక్షకాంత క్రమ్మర నుద్యానవనమ్మునకుఁ బోయి పుష్పలతా విశేషంబులం జూచుచుండెను.

అంతలోఁ బరిచారిక వచ్చి నమస్కరింపుచు దేవీ ! మా రాజపుత్రిక మిమ్ము విడిచి వచ్చినందులకు నన్ను నిందించినది. మీ రాకవిని మిగుల నానందించినది పోవుదము రమ్ము అని సానునయముగా బలికిన విని యమ్ముదిత ముదితహృదయయై యమ్మదవతి వెంట నా వాల్గంటికిం బోయినది.

అంతలో మలయవతి జలకమాడి నూత్నమాల్యాంబరానులేపనాదులచే