పుట:కాశీమజిలీకథలు -09.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనమంజరి కథ

211

సఖి - ఊ, తరువాత వాఁడేమి జేసెను?

మల – వాఁడేమి జేసెనో సిగ్గువిడిచి చెప్పవలయునా? వినుము.

చ. పొలుపుఁగఁ జెంతఁ చేరి వలపు ల్మొలపించు పచోవిజృంభణల్
    వెలయఁగ నక్కుఁ జేర్చి ననువేనలి దువ్వుచు మోము మోమునన్
    గలిపి కపోలచుంబల మొనర్చుచు వాతెఱ తేనెగ్రోలె నిం
    పలవడ నామానోహరుఁ డహా? వెసమై వివశత్వ మందగన్.

సఖి -- మేలు మేలు, స్వప్నమందైన నీ మనోరథకుసుమంబు ఫలించినది. మంచిదియే తరువాత.

మరి - అంతలో శాతోదరి వచ్చి సఖీ ? తెల్లవారుచున్నది. యుద్యానవనంబునకుఁ బోవుదము లెమ్మని లేపి నాకల కంతరాయము గలుగఁ జేసినది.

సఖి - అయ్యయ్యో! మంచి యంతరమున నంతరాయము గలిగినది కదా ? శాతోదరిని శిక్షింపవలసినదే.

మల - నీ వనినట్లే పాపము కోపముతో దానిం దన్ని నేను రాను నీవు పొమ్మని పలికి క్రమ్మరఁ గన్నుల మూసికొంటిని.

సఖి - మఱల నాకల దోచినదా ?

మల - ఏల తోచెడిని ? దానిం ధ్యానించుచుండ నిద్రయే పట్టినదికాదు. వాని యాకారము కన్నులకుఁ గట్టినట్లే యున్నది. తూలికయు వర్ణికపాత్రికయు నిటు దెమ్ము. చిత్రపటంబున లిఖించెదంగాక యని తత్సామగ్రిఁ దెప్పించుకొని యప్పుడే యప్పురుషుని యాకారము వ్రాసి చెలికత్తియకుఁ జూపినది. అయ్యంబుజాక్షి వక్షస్యస్తహస్తయై వింతగా నా చిత్రఫలక ముపలక్షించుచుండెను. శాతోదరి వారి సంవాదము పొంచియుండి యాలించుచు నంతలో నెదురకు వచ్చి మచ్చెకంటికి ఇదిగో నీ మనోహరు నర్చించుటకై పూవులం దెచ్చితిని. పూజింపుమని పలుకుచుఁ బుష్ప బాజనం బెదురఁ బెట్టనది. మలయవతి తలయెత్తిచూచి చాటుననుండి మా మాటల నాలకించితివా యేమి? పూజింపుమనుచుంటివి. మంచిసమయమున లేపితివిగదా? చూడు మీతఁ డెవడో చెప్పుకొనుము అని యా చిత్రపటము చూపినది.

చూచి తలయూచుచు నా పరిచారిక రానిమ్ము. తొందరపడకుము ఈ రాత్రి మఱల నాచతురుఁడు కలలోవచ్చి తరువాయిపని నెరవేర్చునులే. అని పరిహాస మాడినది. మలయవతి నవ్వుచుఁ బూతోటనుండి యప్పుడే వచ్చితివేల? నే నందు రావలయు నకొనుచుంటినే యనవుఁ డా మగువ యిట్లనియె.

గజగమనా! నా యాగమన కారణంబు వినుము. యక్షకుల సార్వభౌముఁ డగు కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుని యిల్లాలఁట. మదనమంజరి యను మదనవతి గగనమార్గంబున నెందేనిం బోవుచు మన యుద్యానవనమునందలి ప్రసూనముల సౌరభ్యము నాసాపర్వము గావింప నా తోటలోనికి దిగివచ్చి వింతగాఁ జూచుచుండ