పుట:కాశీమజిలీకథలు -09.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

పరి – అబ్బా? నేఁ జెప్పజాలను. ఒక్క చక్కదనము ఒక్క విద్య ఒక్క శౌర్యము ఒక్క ధైర్యము ఒక్క సాహసము పనికిరాదు. అన్ని గుణములు గలిగిన వాఁడెక్కఁడ దొరకును ? విరించి యామెకొఱకుఁ గ్రొత్తగా సృష్టించ వలయును.

యక్ష. - ఆమె కోరెడు గుణము లన్నియుం గలవానిఁ దీసికొనివత్తు నా కేమి పారితోషిక మిప్పింతువు.

పరి - ఏమో! అబ్బా? నే జెప్పఁజాలను. మన్మధుఁడు విద్యాశూన్యుఁడనియు జయంతుఁడు వితరణవిముఖుఁడనియు నలకూబరుఁడు పరాక్రమరహితుఁ డనియు నామె వారినే యాక్షేపించుచుండు నితరు లామెకు నచ్చుదురా ?

యక్ష - ఆమె కేమియు వంకలు లేవా?

పరి - ఆమె కేలోపములేదని నేను శపథము జేసి చెప్పఁగలను.

యక్ష -- నీ వామె చక్కదన మెక్కుడుఁగా మెగడుచుంటివి. నన్నొకసారి యామె యొద్దకుఁ దీసికొని పోయెదవా?

పరి - అమ్మా ! నీ విందే యుండుము. నేను పోయి నీ వృత్తాంతము సెప్పి యామె సెలవుఁ బొంది దీసికొనిపోయెద నెట్లయిన వారు రాజపుత్రికలు గదా?

యక్ష -- అదియే లెస్స. నీవు పోయిరమ్ము, నేనిందే యుండెదననుటయు సంతసించుచు నక్కాంత మలయవతి శుద్ధాంతమున కరిగినది. మదనమంజరియు దాని వెనుకనే తిలోహితయై రాజపుత్రికయున్న గదియొద్ద కరిగినది. అట్టి సమయమున మలయవతి పర్యంకము మీఁదనే కూర్చుండి. మఱియొక సఖురాలితో నిట్లు ముచ్చటింపు చుండెను.

మలయవతి - సఖీ! నా స్వప్నవృత్తాంతము నీతో నేమని వక్కాణింతును సిగ్గు సిగ్గు దాపున నెవ్వరు లేరుగదా.

సఖీ - నిన్నింత ప్రొద్దెక్కువరకు లేవకుండఁగ జేసిన యాకలతెఱ గెఱుంగ నా యంతరంగ మూరక వేగిరపడుచున్నది. ఇందొరులు లేరు. సత్వరముగాఁ జెప్పుము.

మల - వాల్గంటి! నా కిటువంటి స్వప్న మెన్నఁడును రాలేదు. వినుము. ద్వీపాంతరవాసి యెవ్వడో యొక చక్కని పురుషుండు. అని కన్నులు మూసికొని ధ్యానించుచు నెంతవఱకుఁ జెప్పితిని?

సఖి -- చక్కని వాఁడని చెప్పి మోహవివశవైతివి? వాని చక్కఁదనము నీకు నచ్చినట్లున్నది. కానిమ్ము తరువాత నేమి జరిగినది? మల - చక్కనివాఁడా యని యడుగుచుంటివా? నా హృదయంబున నెట్టి సౌందర్య ముండవలయునని చిత్రించుకొని యుంటినో యట్లే యున్నవాఁడు.