పుట:కాశీమజిలీకథలు -09.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(27)

మదనమంజరి కథ

209

గీ. మఱియుఁ గర్నాట పాంచాల మగధ లాట
    కోసలాది ధరానాయకుల కుమారి
    కలఁ గనుంగొని యాధరాతలవరేణ్యు
    సాటిగారని విడిచి యక్షకుల వనిత.

మఱియు ద్వీపాంతరంబుల కరిగి యందందు సంచరించుచు నొకనాఁడు మలయవతీ నగర ప్రాంతోద్యానవనంబునకుం బోయి యందలి వింతలు సూచుచు నందుఁ బుష్పములు గోయుచున్న యొక జవరాలిం గాంచి మించుబోఁడీ! నీ వెవ్వతెవె? ఈ యుద్యానవన మెవ్వరిది? ఈదేశము పేరేమి? అని అడిగిన నప్పడఁతి విస్మయముతో నామెం జూచుచు నిట్లనియె.

ఇంతీ? నీవడిగిన వృత్తాంతము తరువాత జెప్పెదంగాని ద్వారస్థులకుఁ దెలియకుండ నీ వనములోనికి నీవెట్లు వచ్చితివి? నీ వెక్కడిదానవు? నీ చక్కదన మక్కజము గొలుపుచున్నది. ముందు నీయుదంత మెఱింగింపుమని యడిగిన యక్షకాంత యిట్లనియె.

పద్మాక్షీ! నేనొక యక్షకాంతను. కుబేరుని తమ్మునిభార్యను నాపేరు మదనమంజరి యంద్రు. మేము గగనసంచారంబున నెల్ల లోకములు దిరుగుచుందుము. ఆకాశమార్గంబునఁ బోవుచుండ నిందలి కుసుమసౌరభ్యములు నన్నిందు లాగికొని వచ్చినవి. నభోమార్గంబున లోపలికి వచ్చితినని జెప్పిన విని యావనిత యామెకు నమస్కరింపుచు దేవీ! మీరు దేవతలు. మీ దర్శనము జేయుటచే నేఁడు నేను గృతార్థురాలనైతిని. వినుండు. ఇది మలయవతి యను నగరము. మలయధ్వజుఁడను రాజీ ద్వీపమును బాలించుచున్నాఁడు. ఆ నృపతికి మలయవతి యను కూఁతురు గలదు. త్రిలోకసుందరి యగు నా మగువకు నేను సఖురాలను పరిచారికను. ఈ యుద్యానవన మావనజగంధి విహరించునది. నిత్య మీపాటి కాపాటలగంధి యీ తోఁటకు వచ్చునదియే నేఁడొడలిలో నస్వస్థతగానుండి పెందలకడ లేచినది కాదు. ఈ పూవు లా వెలది నిమిత్తమే కోసికొని పోపుచున్నదాన నని యందలి వృత్తాంతమంతయుం జెప్పినది.

యక్షకాంత - సరోజముఖీ? మీ రాజపుత్రిక త్రిలోకసుందరి యని జెప్పితివి. చక్కఁదన మొక్కటియేనా విద్యలేమైనం జదివినదా ?

పరిచారిక - ఆమె విద్యావతి యగుటయే యింతవఱకు వివాహము జఱుగ నాటంకము గలిగినది.

యక్ష -- వివాహమునకు విద్యయేమి యాటంకముఁ జేయును ?

పరి - మూడుఁసారులు స్వయంవరములు జరిగినవి. భూమండలంబునందలి రాజు లందరు వచ్చిరి. ఆమె కెవ్వడు నచ్చలేదు.

యక్ష - ఆమె వరింపఁ దగిన వరుం డెట్లుండవలయును ?